- Home
- Sports
- Cricket
- ఇషాన్ ను దక్కించుకునే అవకాశం లేకపోవడంతో.. అంత ఖర్చు చేసి అతడిని తీసుకున్నాం : ముత్తయ్య మురళీధరన్
ఇషాన్ ను దక్కించుకునే అవకాశం లేకపోవడంతో.. అంత ఖర్చు చేసి అతడిని తీసుకున్నాం : ముత్తయ్య మురళీధరన్
Muttiah Muralitharan: బెంగళూరు వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల ఎంపిక ఆశ్చర్యానికి గురి చేసింది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ విభాగంలో ఆ జట్టు ఇషాన్ కిషన్ కోసం పోటీ పడింది. కానీ చివరికి..

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో భారత యువ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కిషన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నించింది.
కానీ ముంబై అతడిని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో.. ఏకంగా రూ. 15.25 కోట్లు వెచ్చించి మరీ ఇషాన్ ను కొనుగోలు చేసింది. ముంబైతో వేలం పోటీలో నెగ్గలేక ఇషాన్ ను వదులుకున్న హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ స్థాయి వికెట్ కీపర్ అవసరం ఏర్పడింది.
దీంతో ఆ జట్టు నాణ్యమైన వికెట్ కీపర్ల కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ కోసం భారీగా ఖర్చు చేసింది. వేలంలో అతడి కోసం రూ. 10.75 కోట్లు వెచ్చించింది ఎస్ఆర్హెచ్.
ఇషాన్ కోసం పోటీ పడి వేలంలో ముంబైతో నెగ్గలేక చివరికి పూరన్ తో సరిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీధరన్.. ఇదే విషయానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఓ స్పోర్ట్స్ వెబ్ ఛానెల్ తో మురళీధరన్ మాట్లాడుతూ... ‘మేం ఇషాన్ కిషన్ ను దక్కించుకోవాలని చూశాం. అందుకోసం వేలంలో కూడా గట్టి పోటీనే ఇచ్చాం. కానీ అతడు మేం నిర్దేశించుకున్న బడ్జెట్ ను దాటేశాడు. దీంతో మేము ఇతర ప్రత్యమ్నాయాలను వెతకాల్సి వచ్చింది.
బెయిర్ స్టో రూపంలో మాకు ఒక ఆప్షన్ అయితే ఉంది కానీ అతడు టోర్నీ మొత్తం అందుబాటులో ఉంటాడా..? లేదా..?అనేది అనుమానమే. దాంతో మేము ఒక అంతర్జాతీయ స్థాయి వికెట్ కీపర్ కోసం వేట మొదలుపెట్టాం. అప్పుడు మాకు పూరన్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికినట్టు అనిపించింది...
తర్వాత సీజన్ లో అతడు (పూరన్) మా జట్టు తరఫున మెరుగ్గా రాణిస్తాడని మేము నమ్ముతున్నాం. ఇక పూరన్ కు అంత ఖర్చు పెట్టడం అవసరమా..? అని వస్తున్న ఆరోపణల గురించి చెప్పాలంటే.. ఇతర ఫ్రాంచైజీలు కూడా అతడు కావాలని కోరుకుంటున్నట్టే కదా..? మేమొక్కరమైతే కాదు కదా..’ అని అన్నాడు.
గత సీజన్ లో పంజాబ్ తరఫున ఆడిన పూరన్ దారుణంగా విఫలమయ్యాడు. 11 ఇన్నింగ్సులాడిన పూరన్.. 85 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ ఐపీఎల్ వేలం ముగిశాక టీమిండియాతో మొదలైన టీ20 సిరీస్ లో మాత్రం రెచ్చిపోయి ఆడుతున్నాడు.
గత మూడు టీ20లలో అతడి స్కోర్లు వరుసగా.. 61, 62, 61 గా ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెల రోజుల గడువుంది. మరి ఈ నెలరోజుల తర్వాత కూడా పూరన్ ఇదే ఫామ్ కొనసాగించగలడా..? ఐపీఎల్ లో తనపై భారీ ఆశలు పెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా..? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.