Stuart Broad: ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ కు షాక్.. అగ్ని ప్రమాదానికి దగ్ధమైన పబ్
ENG vs NZ: ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కు ఊహించని షాక్ తగిలింది. అతడు సహ యజమానిగా ఉన్న పబ్ లో అగ్ని ప్రమాదం జరిగింది.

ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కు చెందిన పబ్ లో మంటలు చెలరేగాయి. ఈస్ట్ మిడ్లాండ్స్ లోని అప్పర్ బ్రాటన్ గ్రామంలో ఉన్న ‘ది టాప్ అండ్ రన్’ పబ్ లో రెండ్రోజుల (శనివారం తెల్లవారుజామున) క్రితం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
బ్రాడ్ ప్రస్తుతం ట్రెంట్ బ్రిడ్జిలో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆడుతున్నాడు. రెండో టెస్టు రెండో రోజుకు ముందు బ్రాడ్ కు ఈ ప్రమాదం గురించి తెలసింది. దీంతో అతడు వెంటనే ఆ పబ్ లో పనిచేస్తున్న సిబ్బంది గురించి ఆరా తీశాడు.
2016 లో నాటింగ్హామ్షైర్ కు చెందిన ఆటగాడు హ్యారీ గర్నీతో కలిసి బ్రాడ్ ఈ పబ్ ను ప్రారంభించాడు. అప్పర్ బ్రాటన్ లో ఉన్న ఈ పబ్ లో శనివారం తెల్లవారుజామున (3.22 గంటలకు) అనూహ్యంగా మంటలు చెలరేగాయి. దీంతో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు త్వరితగతిన అక్కడికి చేరుకున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని నిర్వహకులు తెలిపారు.
Stuart Broad-Joe Root
ప్రమాదం జరిగిన సమయంలో ఆ పబ్ లో ఎవరూ లేకపోవడంతో ఆస్తి నష్టం తప్ప ప్రాణనష్టం జరగలేదని నిర్వాహకులు చెప్పారు. కానీ మంటలు బాగా ఎగిసిపడటంతో పబ్ లోని ఫస్ట్ ఫ్లోర్ మాత్రం తీవ్రంగా డ్యామేజ్ అయింది.
కాగా ఈ ఘటనకు గల కారణాలింకా తెలియరాలేదు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని పబ్ కో ఓనర్ హ్యారీ చెప్పాడు. ఇదిలాఉండగా ఘటన వల్ల ఇబ్బందులకు గురైన గ్రామస్తులకు హ్యారీతో పాటు బ్రాడ్ క్షమాపణలు చెప్పారు.
దీనిపై స్టువర్ట్ బ్రాడ్ ట్విటర్ లో స్పందిస్తూ.. ‘మీకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నా. నా ఆలోచనలన్నీ మా స్టాఫ్ గురించే ఉన్నాయి. ఇలా జరిగినందుకు బాధగా ఉంది..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.