- Home
- Sports
- Cricket
- ద్వైపాక్షిక సిరీస్ లు దండగ.. ఐపీఎల్ రెండు సీజన్లు బెటర్: టీమిండియా మాజీ హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్
ద్వైపాక్షిక సిరీస్ లు దండగ.. ఐపీఎల్ రెండు సీజన్లు బెటర్: టీమిండియా మాజీ హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్
Ravi Shastri: క్రికెట్ లో ఆటకు సంబంధించిన విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేశాడు. ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల దండగ వ్యవహారమని వ్యాఖ్యానించాడు.

రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ లు దండగ వ్యవహారమని, వాటిని తగ్గించి ఐపీఎల్ ను ప్రతి ఏటా రెండు సీజన్లుగా ఆడించాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ద్వైపాక్షిక సిరీస్ లతో ఒనగూరేదేమీ లేదని.. ఏడేండ్లు తాను టీమిండియా కోచ్ గా పనిచేసినా తనకు ఒక్క మ్యాచ్ కూడా గుర్తులేదని.. వాటికి బదులు టీ20 ప్రపంచకప్ ఒకటి ఆడించి మిగతావి దాదాపు తగ్గించడమే మంచిదని.. ఆ దిశగా క్రికెట్ బోర్డులు ఆలోచన చేయాలని వ్యాఖ్యానించాడు.
రాబోయే కాలంలో ఆ తరహా మార్పులు చూడటం ఖాయమని రవిశాస్త్రి పునరుద్ఘాటించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘రాబోయే కాలమంతా (ఒక సంవత్సరంలో రెండు ఐపీఎల్ సీజన్లు) అదే. భవిష్యత్ లో మనం ఐపీఎల్ ను రెండు సీజన్లలో 140 మ్యాచులు (70-70)గా చూడొచ్చు.
టీ20 క్రికెట్ లో రెండు దేశాల మధ్య చాలా ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతున్నాయి. నేనింతకు ముందే ఈ విషయం గురించి చెప్పాను. టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు కూడా భారత్ చాలా టీ20 మ్యాచులు ఆడింది. కానీ అందులో నాకు ఒక్కటి కూడా గుర్తులేదు.
టీమిండియా ఒకవేళ టీ20 వరల్డ్ కప్ గెలిస్తే అదేమైనా గుర్తు పెట్టుకునేవాడినేమో. కానీ దురదృష్టవశాత్తు మనం అది గెలవలేకపోయాం. టీ20 క్రికెట్ అనేది రెండు దేశాల మధ్య మరీ ఎక్కువ ఆడుతున్నారు. దానికి అంత అవసరం లేదు. ఫ్రాంచైజీ క్రికెట్ మహా ఎక్కువ.
క్రికెట్ లో కూడా ఫుట్బాల్ మోడల్ రావాలి. ఫుట్బాల్ లో చాలా మంది ఆటగాళ్లు ప్రపంచకప్, మరిన్ని కీలక టోర్నీలు మాత్రమే వాళ్ల దేశం తరఫున ఆడతారు. ఆ తర్వాత ఫ్రాంచైజీలకే అధిక ప్రాతినిథ్యం వహిస్తారు.
ఆ విధానం టీ20 క్రికెట్ లో కూడా రావాలి. ప్రతి దేశం వారి క్రికెటర్లను ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటానికి అనుమతినివ్వాలి (ప్రస్తుతం టీమిండియా అలా ఇవ్వడం లేదు). ప్రతి రెండేళ్లకోమారు టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తే చాలు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
కాగా.. ఇప్పటికే ఐపీఎల్ లో ఒక్క సీజన్ లో 70 మ్యాచులు ఆడుతున్నారు ఆటగాళ్లు. ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడుతున్నది. దీనిని వచ్చే ఏడాది నుంచి 18 మ్యాచులు చేయాలని బీసీసీఐ ప్రతిపాదన చేస్తున్నట్టు కూడా సమాచారం. ఇలా చేస్తే రెండు నెలల ఐపీఎల్ కాస్తా మూడు నెలలు అవుతుంది.
శాస్త్రి ప్రతిపాదన ప్రకారం.. ఒక సీజన్ లో 70 మ్యాచులు మరో సీజన్ లో 70 మ్యాచులు ఆడాలి. అంటే ప్రతి యేటా నాలుగు నెలలు. మరి ఈ ప్రతిపాదనపై బీసీసీఐతో పాటు ఇతర దేశాల బోర్డులు, ఐసీసీ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.