స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ చితక్కొట్టుడు వెనక వీరేంద్ర సెహ్వాగ్... రెచ్చగొట్టి మరీ...
ఐపీఎల్ 2020లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు స్టీవ్ స్మిత్. మ్యాక్స్‌వెల్ అయితే మరీ ఘోరం. 14 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. కానీ సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. బుమ్రా, షమీ, చాహాల్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను చితక్కొడుతూ బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి పర్ఫామెన్స్ వెనక వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడట.
ఐపీఎల్ 2020లో ఘోరంగా ఫెయిల్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై ‘10 కోట్ల ఛీర్ లీడర్’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన మ్యాక్స్‌వెల్... 10 కోట్ల రూపాయలు తీసుకుని మరీ ఓ లగ్జరీ విహార యాత్రకు వచ్చినట్టు ఉంది... అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు వీరూ.
వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్లకు సానుకూలంగా స్పందించిన మ్యాక్స్‌వెల్... ‘నన్ను 10 కోట్ల ఛీర్ లీడర్ అన్నందుకు నాకు వీరూపై ఎలాంటి కోపం లేదు. అతన్ని అర్థం చేసుకోగలను. ఈ వ్యాఖ్యలను నేను బూస్ట్ ఇచ్చే ఎనర్జీ డ్రింక్‌లా వాడుకుంటాను’ అని కామెంట్ చేశాడు.
చెప్పినట్టుగానే ఐపీఎల్ తర్వాత టీమిండియాపై జరిగిన రెండు వన్డే మ్యాచుల్లోనూ భారత బౌలర్లపై ప్రతాపం చూపించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...
మొదటి వన్డేలో 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
రెండో వన్డే మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు మ్యాక్స్‌వెల్. ఐపీఎల్ మొత్తంగా ఒక్క సిక్సర్ కొట్టలేకపోయిన మ్యాక్స్‌వెల్, రెండు మ్యాచుల్లో 6 సిక్సర్లు బాదాడు.
అంతేకాకుండా ఐపీఎల్ మొత్తంలో కలిపి 108 పరుగులే చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, రెండు వన్డేల్లోనే ఈ పరుగులు సాధించడం మరో విశేషం...
‘10 కోట్ల ఛీర్ లీడర్’ అని తనను విమర్శించిన వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్లకు రియాక్షన్, టీమిండియా బౌలర్లపైనే కనిపించింది.
వరుస మ్యాచుల్లో సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్‌పైన కూడా వన్డే సిరీస్‌కి ముందు కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
‘వన్డేల్లో స్టీవ్ స్మిత్ కాస్త మెరుగైన స్టైయిక్ రేటుతో బ్యాటింగ్ చేయాలి. స్మిత్ వన్డే స్టైయిక్ రేటు, నా టెస్టు స్టైయిక్ రేటుతో సమానంగా ఉంది... ’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.
వీరూ కామెంట్లకు రియాక్షన్‌గా వన్డేల్లో కూడా 150+ స్టైయిక్ రేటుతో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు స్టీవ్ స్మిత్. వరుసగా రెండు వన్డేల్లోనూ 62 బంతుల్లో సెంచరీ బాది, రికార్డు క్రియేట్ చేశాడు...
ఇలా పరోక్షంగా ఆస్ట్రేలియా క్రికెటర్లపై కామెంట్ చేసి వారు కసితీరా ఆడడానికి కారణమయ్యాడు వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్...
అయితే మ్యాక్స్‌వెల్ ప్రదర్శనపై మళ్లీ కామెంట్ చేసిన వీరూ... ‘జాతీయ జట్టుకి ఆడకపోతే టీమ్‌లో చోటు పోతుంది. కాబట్టి కచ్ఛితంగా చచ్చినట్టు ఆడతారు. అదే ఐపీఎల్‌లో అయితే ఆడినా, ఆడకపోయినా డబ్బులు వస్తాయి. కాబట్టి ఎన్ని మ్యాచులు ఆడినా ఒక్క సిక్స్ కూడా కొట్టలేరు’ అంటూ విమర్శించాడు.