- Home
- Sports
- Cricket
- Virat Kohli: బీసీసీఐ కాదు.. సమాధానం చెప్పాల్సింది అతడే.. విరాట్-గంగూలీ వివాదంపై సన్నీ కామెంట్స్
Virat Kohli: బీసీసీఐ కాదు.. సమాధానం చెప్పాల్సింది అతడే.. విరాట్-గంగూలీ వివాదంపై సన్నీ కామెంట్స్
Virat Kohli - Sourav Ganguly: నిన్నటిదాకా రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీల వైరం ఒక్కసారిగా బీసీసీఐ-కోహ్లీగా మారింది. భారత టెస్టు జట్టు సారథి చేసిన వ్యాఖ్యలపై తాజాగా సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో బీసీసీఐతో పాటు దాని అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలను దోషులుగా చేసి నాలుగు రోడ్ల కూడలిలో నిలబెట్టాడు టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బుధవారం అతడు పాల్గొన్న పత్రికా సమావేశంలో బీసీసీఐ తో పాటు గంగూలీ మీద విరాట్ చేసిన వ్యాఖ్యలు.. బోర్డుకు, ఆటగాళ్లకు ఉన్న సమాచార లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
తాను టీ20 కెప్టెన్సీని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు బోర్డు ఆ నిర్ణయాన్ని గౌరవించిందని, కానీ వన్డే కెప్టెన్సీ మార్పు గురించి మాత్రం గంటనర ముందే సమాచారం అందించిందని విరాట్ తెలిపిన విషయం తెలిసిందే. ఇక దానితో పాటు టీ20 కెప్టెన్ గా వైదొలగకూడదని బీసీసీఐతో పాటు గంగూలీ కూడా చెప్పలేదని, అసలు దాని గురించి చర్చే జరుగలేదని వాపోయాడు. ఈ వ్యాఖ్యలు ప్రాధన్యం సంతరించుకున్నాయి.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ కాదని, సమాధానం చెప్పాల్సిన ఏకైక వ్యక్తి సౌరవ్ గంగూలీయేనని స్పష్టం చేశాడు.
గవాస్కర్ మాట్లాడుతూ... ‘కోహ్లీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సింది బీసీసీఐ కాదు. అవి ఆయన వ్యక్తిగతంగా సౌరవ్ గంగూలీ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే అతడే.. తాను కోహ్లీతో మాట్లాడానని చెప్పాడు.
అతడు బీసీసీఐ చీఫ్. ఈ వివాదాన్ని ముగించాలంటే అతడే దీనికి సమాధానం చెప్పాలి. ఆటగాళ్లు, బీసీసీఐ మధ్య ఈ వైరుధ్యం గురించి గంగూలీ కచ్చితంగా మాట్లాడాలి..’ అని అన్నాడు.
అంతేగాక.. ‘ఆటగాళ్లకు, బీసీసీఐకి మధ్య సమాచార లోపం ఉండకూడదని గవాస్కర్ చెప్పాడు. ఇప్పటివరకైతే జరిగిందేదో జరిగింది. ఇకపై మాత్రం అలా కాకుండా చూసుకుంటే మంచిది.
ఒకవేళ ఏదైనా అత్యవసర ప్రకటన చేయాల్సి వచ్చినప్పుడు.. బీసీసీఐ అధ్యక్షుడో లేక సెలెక్టర్లో మీడియా ముందుకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలి. ఒకవేళ అది కూడా సాధ్యం కాని వేళలో ప్రెస్ రిలీజ్ చేస్తే సరిపోతుంది..’ అని బీసీసీఐకి సన్నీ సూచించాడు.
ఇదిలాఉండగా.. బీసీసీఐ చీఫ్ తనతో సంప్రదింపులు జరుపలేదని, కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్టు గంటనర ముందే చెప్పిందని వ్యాఖ్యానించిన కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. ఆ వ్యాఖ్యలను బోర్డు తోసిపుచ్చింది.
నాయకత్వ మార్పుపై సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ.. విరాట్ తో ముందుగానే చర్చించాడని పేర్కొంది. అంతేగాక.. టీ20 కెప్టెన్సీ వ్యవహారంపై కూడా కోహ్లీతో.. గంగూలీ తో పాటు బీసీసీఐ అధికారులంతా నచ్చజెప్పినా అతడు వినలేదని, పట్టు వీడకుండా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించాడు.