- Home
- Sports
- Cricket
- సూర్య బాగా ఆడాడు.. కొన్ని మంచి ఇన్నింగ్స్ కూడా ఉండొచ్చు.. కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం అదే : కార్తీక్
సూర్య బాగా ఆడాడు.. కొన్ని మంచి ఇన్నింగ్స్ కూడా ఉండొచ్చు.. కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం అదే : కార్తీక్
Virat Kohli: 2022 కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త సంవత్సరం రాకతో అందరూ గతేడాది స్మృతులను తలుచుకుంటూ నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో క్రికెటర్లు కూడా గతేడాది జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.

టీమిండియాకు 2022 సంవత్సరంలో అనుకున్న గొప్ప ఫలితాలు రాకపోయినా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా పలువురు ఆటగాళ్లు ఘనతలు నెలకొల్పారు. కొంతమంది భారత్ కష్టకాలంలో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు. మూడేండ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. కానీ అన్నింటికంటే తనకు టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమమైనదంటున్నాడు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా కోహ్లీ.. పాకిస్తాన్ పై ఛేదనలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 50 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశలో హార్ధిక్ పాండ్యాతో కలిసి పోరాడాడు. 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి చివరి ఓవర్లో భారత్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. కోహ్లీ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇప్పుడు కార్తీక్ కూడా ఇదే అంటున్నాడు.
ఓ క్రీడా ఛానెల్ తో కార్తీక్ మాట్లాడుతూ..‘ఈ ఏడాది (2022 లో) భారత్ లో పలువురు అద్భుత ప్రదర్శన చేశారు. వాటన్నింటిలో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై ఆడిన ఇన్నింగ్సే అత్యుత్తమం. ఆ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన ఆట కొన్ని తరాలకు గుర్తుంటుంది..’ అని కోహ్లీని కొనియాడాడు.
అయితే 2022లో టీ20 ఫార్మాట్ లో అత్యుత్తమ బ్యాటర్ ను ఎంపిక చేయాల్సి వస్తే మాత్రం తన ఓటు సూర్యకుమార్ యాదవ్ కే అని అభిప్రాయపడ్డాడు. దేశం తరఫునే గాక అంతర్జాతీయంగా కూడా అతడే టీ20లలో బెస్ట్ బ్యాటర్ అని ప్రశంసలు కురిపించాడు.
ఇక వన్డేలలో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణించాడని, టెస్టులలో మాత్రం తన ఓటు రిషభ్ పంత్ కే వేస్తానని చెప్పాడు. కార్తీక్ చెప్పినట్టే.. బీసీసీఐ కూడా ఈ ముగ్గురినే అత్యుత్తమ బ్యాటర్లుగా ఎంపికచేయడం గమనార్హం. బీసీసీఐ శనివారం విడుదల చేసిన జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (టీ20), శ్రేయాస్ అయ్యార్ (వన్డే), రిషభ్ పంత్ (టెస్టు) బెస్ట్ బ్యాటర్లుగా నిలిచారు.
2022లో జట్టుగా టీమిండియా ఆశించిన స్థాయిలో ఆడలేదని కార్తీక్ అన్నాడు. వన్డేలలో బలమైన జట్టుతో బరిలోకి దిగలేదని, టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని ఆ ఫార్మాట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మూలానా వన్డేలకు పెద్దగా పట్టించుకోలేదని చెప్పాడు. అందుకే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ చేతిలో వన్డేలు ఓడటానికి కారణం అదేనని అభిప్రాయపడ్డాడు.