- Home
- Sports
- Cricket
- ఇది కదా సక్సెస్ అంటే.. రూ. 2.5 కోట్ల ప్రైజ్‌మనీ, గ్రూప్ 1 ఉద్యోగం. మట్టిలో మాణిక్యం మన శ్రీ చరణి
ఇది కదా సక్సెస్ అంటే.. రూ. 2.5 కోట్ల ప్రైజ్‌మనీ, గ్రూప్ 1 ఉద్యోగం. మట్టిలో మాణిక్యం మన శ్రీ చరణి
Shree Charani: మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుత ఆటతీరును కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగమ్మాయి శ్రీ చరణి.

గ్రామీణ ప్రాంతం నుంచి..
కడప జిల్లాలోని ఎర్రమల్లె అనే చిన్న గ్రామం నుంచి బయలుదేరిన ఒక అమ్మాయి.. ఈరోజు భారతదేశానికి గర్వకారణమైంది. ఆమే శ్రీ చరణి. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ క్రికెటర్ ప్రపంచ కప్‌లో ఆడిన మొదటి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించింది. తండ్రి చిన్న ఉద్యోగి, కుటుంబం అప్పుల బారిన ఉండటంతో చాల కష్టకాలం ఎదుర్కొంది. అయినప్పటికీ ఏదైనా "సాధించాలి" అనే సంకల్పం ఆమెను ముందుకు నడిపించింది.
క్రీడల పట్ల చిన్నప్పటి ప్రేమ
చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి చూపిన చరణి మొదట బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో ప్రతిభ చూపింది. కానీ 16 ఏళ్ల వయసులో క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో ఆమె మామయ్య కిషోర్ కుమార్ రెడ్డి ఆమెకు మార్గదర్శకుడయ్యారు. ఆ ప్రోత్సాహం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక్కో బంతిని ఎదుర్కొనే ధైర్యం, ఓర్పు, క్రమశిక్షణ ఇవే ఆమె విజయం వెనుక నిలిచిన నిజమైన బలాలు.
ఇబ్బందులు ఎన్ని ఎదురైనా..
ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ వ్యతిరేకత, సరైన సదుపాయాల లేమి. కానీ.. ఇవన్నీ ఆమెను ఆపలేకపోయాయి. తండ్రిని ఒప్పించేందుకు ఏడాది పట్టింది. క్రీడా సామాగ్రి కొనడానికి డబ్బుల్లేకపోయినా, ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది. తన కష్టంతో, పట్టుదలతో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఆమెను తక్కువ అంచనా వేసిన వారే తరువాత ఆమె ప్రతిభను చూసి చప్పట్లు కొడుతున్నారు.
ప్రపంచ కప్ విజేతగా సత్తా చాటిన చరణి
భారత మహిళా జట్టుతో కలిసి ప్రపంచ కప్‌లో చరణి అద్భుత ప్రదర్శన చూపింది. కీలక సమయాల్లో తీసిన వికెట్లు, మ్యాచ్‌ను మలుపుతిప్పిన స్పెల్.. ఇవన్నీ ఆమె ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రపంచ కప్ గెలిచిన క్షణం ఆమెకు మాత్రమే కాదు, మొత్తం దేశానికి గర్వంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వ గౌరవం
చరణి విజయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెను ఘనంగా సత్కరించారు. రూ.2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో 1000 చ.గ. స్థలం, అలాగే ప్రభుత్వంలో గ్రూప్-1 హోదాను ఆమెకు ప్రోత్సాహంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి చరణి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసింది. సీఎం ఆమెను అభినందిస్తూ, "నీ విజయం అనేక యువతీ యువకులకు స్ఫూర్తి" అని ప్రశంసించారు.