- Home
- Sports
- Cricket
- IND vs PAK: దాయాదుల సూపర్-4 పోరులో ఇరు జట్లకూ గాయాల బెడద.. ఇద్దరు స్టార్ పేసర్లు దూరం..?
IND vs PAK: దాయాదుల సూపర్-4 పోరులో ఇరు జట్లకూ గాయాల బెడద.. ఇద్దరు స్టార్ పేసర్లు దూరం..?
Asia Cup 2022: ఆసియా కప్-2022 లో నేడు మరో రసవత్తర పోరు జరుగనున్నది. భారత్-పాకిస్తాన్ మధ్య నేడు దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు గాయాలతో బాధపడుతున్నాయి.

చాలా రోజుల తర్వాత భారత్-పాకిస్తాన్ ల మధ్య వారం రోజుల గ్యాప్ లో రెండు మ్యాచులు జరుగుతున్నాయి. ఆసియా కప్-2022 లో భాగంగా ఇప్పటికే గ్రూప్ దశలో ఓమారు తలపడిన ఈ జట్లు.. నేడు (సెప్టెంబర్ 4) మళ్లీ ఢీకొనబోతున్నాయి.
అయితే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు గాయాలతో బాధపడుతున్నాయి. ఇప్పటికే ఆసియా కప్ కు ముందు పాకిస్తాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిది, వసీం జూనియర్ గాయాల కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రా కూడా గాయంతో టోర్నీ ఆడటం లేదు. అంతేగాక రెండ్రోజుల క్రితం భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. కుడికాలి మోకాలిగాయంతో ఆసియా కప్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇది భారత జట్టుకు కోలుకోలేని దెబ్బ.
ఇదిలాఉండగా తాజాగా భారత్-పాక్ సూపర్ -4 పోరుకు ముందు ఇరు జట్లకు షాకులు తప్పలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఆడిన పాకిస్తాన్ పేసర్ షాహనవాజ్ దహనీ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు నేటి మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో హసన్ అలీ గానీ, మహ్మద్ హస్నెన్ గానీ తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశముంది.
Image credit: PTI
ఇక భారత జట్టు తరఫున అవేశ్ ఖాన్ కూడా పాకిస్తాన్ తో మ్యాచ్ కు అందుబుటులో ఉండటం అనుమానంగానే ఉంది. అవేశ్ ఖాన్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో అతడు శనివారం ప్రాక్టీస్ కు కూడా రాలేదు.
దీంతో అవేశ్ ఖాన్ ఈ మ్యాచ్ లో ఆడతాడా..? లేదా..? అనేదానిపై స్పష్టత లేదు. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం.. ‘అవేశ్ ఖాన్ స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నాడు. అందుకే నేడు ప్రాక్టీస్ లో పాల్గొనలేదు. పాక్ తో మ్యాచ్ నాటికి అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం..’ అని తెలిపింది.
R Ashwin
ఒకవేళ అవేశ్ లేకుంటే భారత్ అశ్విన్ ను బరిలోకి దించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే జడేజా లేకపోవడంతో స్పిన్ ఆల్ రౌండర్ సేవలను కోల్పోయిన భారత్.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అశ్విన్ సరైన ఎంపిక అని భావిస్తున్నది.