- Home
- Sports
- Cricket
- Shikhar Dhawan: గబ్బర్ ఇక గతమేనా..? ధావన్ టీ20 కెరీర్ కు తలుపులు మూస్తున్న సెలెక్టర్లు
Shikhar Dhawan: గబ్బర్ ఇక గతమేనా..? ధావన్ టీ20 కెరీర్ కు తలుపులు మూస్తున్న సెలెక్టర్లు
Team India Squad For SA T20Is: ఐపీఎల్-15 ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా జట్టుతో ఐదు టీ20 లు ఆడనున్నది టీమిండియా. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే అందులో ధావన్ పేరు లేదు.

సఫారీలతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో టీమిండియా అభిమానులు గబ్బర్ గా పిలుచుకునే శిఖర్ ధావన్ కు చోటు దక్కలేదు. గత సిరీస్ ల మాదిరే ఈసారి కూడా సెలెక్టర్లు గబ్బర్ కు మొండిచేయే చూపారు.
ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్నా సెలెక్టర్లు ధావన్ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకోకపోతుండటం గమనార్హం. తాజాగా సఫారీ సిరీస్ కోసం ప్రకటించిన జట్టును చూస్తుంటే ఇక మెల్లమెల్లగా సీనియర్లందరికీ శుభం కార్డు వేసేలా ఉందని అనిపించక మానదు.
గాయం, ఫామ్ లేమి కారణంగా ధావన్ కొద్దిరోజులు ఆటకు దూరమై ఈ ఏడాది దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్ లోనే రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్వదేశంలో విండీస్ తో ముగిసిన వన్డే సిరీస్ లో అతడికి చోటు దక్కినా టీ20 లకు మాత్రం పట్టించుకోలేదు.
ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్ కు కూడా అతడి పేరును పక్కనబెట్టేశారు సెలెక్టర్లు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ టీ20 అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పడ్డట్టేనా..? అన్న వాదనలు వినపడుతున్నాయి.
ధావన్.. ఐపీఎల్ లో గడిచిన ఏడు సీజన్లలో వరుసగా 400 ప్లస్ స్కోరు చేశాడు. 2016 నుంచి వరుసగా ప్రతి సీజన్ లో అతడి స్కోర్లు ఇలా ఉన్నాయి. 2016 లో 501, 479, 497, 521, 618, 587 పరుగులు సాధించిన గబ్బర్ 2022 సీజన్ లో కూడా 14 మ్యాచులలో 460 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ లో అతడే హయ్యస్ట్ రన్ స్కోరర్.
అయినా కూడా సెలెక్టర్లు మాత్రం ధావన్ ను పట్టించుకోకపోవడం చూస్తుంటే అతడి టీ20 కెరీర్ ముగిసినట్టే అనిపిస్తున్నది. ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
సదరు అధికారి మాట్లాడుతూ.. ‘ఇప్పుడో మరెప్పుడో అయినా ఇది జరిగేదే.. (ధావన్ ను టీ20 జట్టులోకి తీసుకోకపోవడం) భారత క్రికెట్ కు అతడు చేసిన సేవలు మరువరానివి. గత దశాబ్దంలో అతడు టీమిండియా విజయాల్లో కీలక భాగస్వామిగా నిలిచాడు.
అయితే మేము రాబోయే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకున్నాం. అందుకు సన్నద్ధంగా ఉండేందుకు తాజా జట్టును ప్రకటించాం. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆస్ట్రేలియా కు వెళ్లే యువ జట్టును సిద్ధం చేయాలనుకుంటున్నాడు..’ అని తెలిపాడు.
అయితే టీ20 లలో చోటు దక్కకపోయినా గబ్బర్ కు వన్డే జట్టులో మాత్రం స్థానం దక్కవచ్చునని ఆ అధికారి తెలిపాడు. ఇంగ్లాండ్ తో జరుగబోయే వన్డే సిరీస్ కు అతడు తిరిగి జట్టుతో చేరతాడని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
సఫారీ సిరీస్ కు భారత జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్