సచిన్ టెండూల్కర్ టాప్-5 అన్ బ్రేకబుల్ రికార్డులు ఇవి
Top 4 Unbreakable cricket records: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అద్భుతమైన ఆటతో క్రికెట్ గాడ్ గా గుర్తింపు పొందాడు. అయితే, సచిన్ సాధించిన అన్ బ్రేకబుల్ రికార్దులు చాలానే ఉన్నాయి.
sachin Tendulkar 5 Unbreakable Cricket Records: భారత క్రికెట్ లెజెండ్, మాజీ స్టార్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఆటతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అనేక అద్భుత విజయాలు, అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు.
అందుకే సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ గా పిలుస్తారు. చిన్న వయసులోనే సచిన్ పెద్ద ఆటగాళ్లను ఎదుర్కొన్నారు. వసీం అక్రమ్ వంటి ప్రమాదకర బౌలర్లను ఆయన 16 ఏళ్ల వయసులోనే ఎదుర్కొన్నారు. ధైర్యంగా బ్యాటింగ్ చేసి రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఆయన సాధించిన టాప్-5 అన్ బ్రేకబుల్ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సచిన్ సాధించిన ఈ రికార్డులను బద్దలు కొట్టడం అంత సులభం కాదు.
1. సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ వన్డే కెరీర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన తొలి వన్డేని 1989లో ఆడాడు. 2011 ప్రపంచ కప్ గెలిచే వరకు సచిన్ భారత్ తరఫున ఆడాడు. 22 ఏళ్లు 91 రోజుల సుదీర్ఘ వన్డే క్రికెట్ కెరీర్‌ను బద్దలు కొట్టడం ఏ ఆటగాడికీ అంత సులభం కాదు. టెండూల్కర్ తర్వాత, బంగ్లాదేశ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ మాత్రమే 18 ఏళ్లు 92 రోజులు వన్డేలు ఆడాడు. 37 ఏళ్లు పైబడిన ఈ ఆటగాడు సచిన్ రికార్డును సమీపించడం కూడా దాదాపు అసాధ్యం.
2. వంద సెంచరీలు
అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్. 100 శతకాలు సాధించడం ద్వారా సచిన్ ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించాడు. అతని తర్వాత విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ ఇప్పటివరకు 81 శతకాలు సాధించాడు, ఇంకా 19 శతకాలు చేయాల్సి ఉంది. కోహ్లీ వయసు కూడా రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇంత పెద్ద ఘనత సాధించడం అంత సులభం కాదు. సచిన్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 శతకాలు సాధించాడు.
3. ఒక సంవత్సరంలో అత్యధిక పరుగులు
ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కూడా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1998లో 34 వన్డేల్లో 1894 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 9 సెంచరీలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో అంతగా మ్యాచ్‌లు ఆడటం లేదు. ఎక్కువగా టీ20 మ్యాచ్‌లే ఆడుతున్నారు. అందువల్ల, ఏ ఆటగాడికైనా ఈ ఘనత సాధించడం ఇప్పుడు దాదాపు ఆసాధ్యం అని చెప్పాలి.
4. సచిన్ అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు
సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం, ఆటగాళ్ళు టెస్టుల్లో తక్కువగా ఆడుతున్నారు, వన్డేలు, టీ20లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అతని తర్వాత జేమ్స్ అండర్సన్ 177 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఇప్పుడు అతను కూడా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఈ సమయంలో, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ 132 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతని వయసును పరిశీలిస్తే, అతను సచిన్ రికార్డును చేరుకుంటాడనేది సందేహమే.
Sachin Tendulkar
5. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన టెండూల్కర్
క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అన్ని ఫార్మాట్లలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసింది కూడా సచినే. టెండూల్కర్ 15,921 పరుగులతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డును కలిగివున్నాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసింది కూడా సచినే. అతను టెస్టు క్రికెట్‌లో 51 సెంచరీలు సాధించాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డును టెండూల్కర్ కలిగి ఉన్నాడు.