- Home
- Sports
- Cricket
- రుతురాజ్ గైక్వాడ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్, సెంచరీ మిస్... టెండూల్కర్ రికార్డును సమం చేస్తూ..
రుతురాజ్ గైక్వాడ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్, సెంచరీ మిస్... టెండూల్కర్ రికార్డును సమం చేస్తూ..
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మినహా ఇస్తే ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్... సన్‌రైజర్స్‌పై బ్యాటు విదిల్చాడు... ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీని 1 పరుగు తేడాతో మిస్ చేసుకున్నాడు...

Gaikwad and Conway
కొత్త పెళ్లి కొడుకు డివాన్ కాన్వేతో కలిసి ఓపెనింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆరంభంలో ఆచి తూచి ఆడారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సమయానికి 40 పరుగులు మాత్రమే చేయగలిగింది సీఎస్‌కే...
అయితే ఆ తర్వాత గేరు మార్చిన రుతురాజ్ గైక్వాడ్.. ఉమ్రాన్ మాలిక్, అయిడిన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్‌లను టార్గెట్ చేస్తూ బౌండరీల మోత మోగించాడు... గత మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, నేటి మ్యాచ్‌లో 154.0 కి.మీ.ల వేగంతో బంతులు విసిరినా ఫలితం దక్కలేదు...
ఉమ్రాన్ మాలిక్ వేసిన 12వ ఓవర్‌లో 17 పరుగులు రాగా, మార్కో జాన్సెన్ వేసిన 15వ ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. నటరాజన్ వేసిన 16వ ఓవర్‌లో 13 పరుగులు రాబట్టారు...
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కలిసి నెలకొల్పిన 157 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించింది రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే జోడి...
తొలి వికెట్‌కి 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, సెంచరీకి పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేసిన రుతురాజ్, టి నటరాజన్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
సీఎస్‌కే తరుపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కాగా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తిచేసుకున్న భారత బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు రుతురాజ్ గైక్వాడ్...
సచిన్ టెండూల్కర్ 31 ఇన్నింగ్స్‌ల్లో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకోగా, రుతురాజ్ కూడా సరిగ్గా 31 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. అయితే ఓవరాల్‌గా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన 8వ బ్యాటర్ రుతురాజ్...
షాన్ మార్ష్ 21 ఇన్నింగ్స్‌ల్లో ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగులు చేయగా సిమ్మన్స్, హేడెన్, బెయిర్ స్టో, క్రిస్ గేల్, కేన్ విలియంసన్, మైక్ హుస్సీ వంటి విదేశీ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్ కంటే వేగంగా ఈ ఫీట్ సాధించారు...
ఐపీఎల్‌లో 99 పరుగుల వద్ద అవుటైన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, పృథ్వీషా, ఇషాన్ కిషన్, క్రిస్ గేల్... 99 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరారు...