మిస్సయ్యారు.. మళ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్, విరాట్.. ఏం జరిగింది?
Rohit Sharma, Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బుధవారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి మిస్సయ్యారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కొంత సమయానికి తిరిగి జాబితాలోకి వచ్చారు. అసలు ఏం జరిగింది?

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్ 10 లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొద్దిసేపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి కనిపించకుండా పోయారు. అయితే, కొంత సమయం తర్వాత మళ్లీ తిరిగి తమ స్థానాలైన రెండో, నాలుగో స్థానాల్లోకి వచ్చారు.
వివరాల్లోకెళ్తే.. రోహిత్, కోహ్లీలు ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ నుంచి కనిపించకుండా పోయారు. దీనితో రోహిత్ శర్మ ఉన్న రెండో స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్, కోహ్లీ స్థానంలోకి న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ వచ్చారు.
బుధవారం మధ్యాహ్నం 1:33 గంటలకు ఈ ఇద్దరు ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌లో కనిపించలేదు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని గంటల తర్వాత, రోహిత్ శర్మ, కోహ్లీ తిరిగి ర్యాంకింగ్స్‌లోకి వచ్చారు. దీనిపై ఐసీసీ ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. రోహిత్ రెండో స్థానంలోకి రావడంతో మళ్లీ బాబర్ తిరిగి మూడో స్థానానికి పడిపోయారు. కోహ్లీ నాలుగో స్థానానికి రావడంతో మిచెల్ ఐదో స్థానానికి పడిపోయారు.
KNOW
టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ
38 ఏళ్ల రోహిత్ శర్మ, 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇద్దరూ టీ20, టెస్ట్ క్రికెట్‌ల నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్లేయర్లు ఆడే ఏకైక అంతర్జాతీయ ఫార్మాట్ వన్డేలు మాత్రమే.
ఇటీవలి కాలంలో వన్డే మ్యాచ్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ, రాబోయే 2027 ప్రపంచ కప్ కోసం ఈ సీనియర్ స్టార్ ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే, వారిద్దరూ వన్డే ప్రపంచ కప్ భారత జట్టు ప్రణాళికలలో లేరనే చర్చ కూడా సాగుతోంది.
భారత వన్డే జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఇప్పటికీ వన్డేలలో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. అతను ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు ముందు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. విరాట్ కోహ్లీ కూడా అదే సమయంలో రిటైర్ అయ్యారు. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ను ఛాంపియన్ గా మార్చడంలో ఈ సీనియర్ ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. భారత్ టైటిల్ గెలిచిన తర్వాత వీరు టీ20 కెరీర్ కు వీడ్కోలు పలికారు.
విరాట్, రోహిత్ లు చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ను మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఆడారు. ఆ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. రోహిత్ 76 బంతుల్లో 83 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
మూడో స్థానంలో కుల్దీప్ యాదవ్
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ తిరిగి మొదటి స్థానానికి వచ్చాడు. కేర్న్స్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేలో, దక్షిణాఫ్రికా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్ తో ఈ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. 33 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
నవంబర్-డిసెంబర్ 2023లో కూడా కేశవ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు, అతను కుల్దీప్, శ్రీలంకకు చెందిన మహీష్ తీక్షణలను అధిగమించి మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్ లో టాప్ లో శుభమన్ గిల్
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శుభమన్ గిల్ 784 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. మొత్తంగా నలుగురు భారత ప్లేయర్లు టాప్ 10 లో ఉన్నారు. భారత జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉండగా, రన్ మిషన్ విరాట్ కోహ్లీ నాల్గో స్థానంలో ఉన్నారు. వీరితో పాటు వన్డే టాప్ 10 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా ఉన్నారు. అయ్యర్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు.
పాకిస్తాన్‌తో జరిగిన చివరి వన్డేలో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ రెండు స్థానాలు పైకి వెళ్లి తొమ్మిదో స్థానానికి చేరుకున్నారు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ లో మనోళ్లే !
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన అభిషేక్ శర్మ టాప్ లో ఉన్నారు. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ రెండో స్థానంలో ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో, యశస్వి జైస్వాల్ 10వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా టాప్ 10 లో నలుగురు భారత ప్లేయర్లు ఉన్నారు.
దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి చేరుకున్నాడు. మూడో స్థానంలో ఫిల్ సాల్ట్, నాల్గో స్థానంలో జోస్ బట్లర్, ఆ తర్వాత ట్రావిస్ హెడ్ ఉన్నారు.