పంత్‌కు పరామర్శల వెల్లువ.. అతడి ఆరోగ్యంపై హిట్ మ్యాన్ ఆరా.. మాల్దీవులు నుంచి ఫోన్‌లో మాట్లాడిన కెప్టెన్
Rishabh Pant Car Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై టీమిండియా సారథి రోహిత్ శర్మ వాకబు చేశాడు. ప్రస్తుతం మాల్దీవులులో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న హిట్ మ్యాన్ తో పాటు పలువురు క్రికెటర్లు..
రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి తన స్వంత ఊరుకు వెళ్తూ రూర్కీ వద్ద కారు ప్రమాదానికి గురికావడంతో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి ఆరోగ్యం గురించి తన సహచర ఆటగాళ్లు, క్రికెట్ ప్రముఖులే గాక సినీ, రాజకీయ నాయకులు కూడా వాకబు చేస్తున్నారు.
బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భాగంగా చేతి వేలి గాయంతో స్వదేశానికి వచ్చిన రోహిత్ శర్మ ప్రస్తుతం కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మాల్దీవులులో ఉన్నాడు. రిషభ్ పంత్ కు యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే రోహిత్ అతడి గురించి వాకబు తీశాడట. ఆదివారం హిట్ మ్యాన్.. రిషభ్ పంత్ డాక్టర్లతో మాట్లాడినట్టు సమాచారం.
రిషభ్ ను పర్యవేక్షిస్తున్న వైద్యులతో మాట్లాడిన రోహిత్.. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉంది..? పంత్ చికిత్సకు ఎలా స్పందిస్తున్నాడు..? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. పంత్ కు చికిత్స అందిస్తున్న వైద్యులతో పాటు అతడి కుటుంబసభ్యులకూ రోహిత్ ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తున్నది.
ఇక కొత్త ఏడాది వేడుకల్లో నిమగ్నమైన భారత క్రికెటర్లు కూడా పంత్ కుటుంబసభ్యులతో మాట్లాడారని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది. వాళ్లకు ఫోన్ చేసి పంత్ ఆరోగ్య పరిస్థితితో పాటు వారికి ధైర్యాన్నిచ్చినట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కష్టకాలంలో పంత్ కు సహచర ఆటగాళ్ల మద్దతు ఎంతో ముఖ్యమని, దానిని టీమిండియా ఆటగాళ్లు నెరవేరుస్తున్నారని తెలిపాయి.
పంత్ ను శనివారం బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ లు పరామర్శించారు. ఈ ఇద్దరూ పంత్ కు చికిత్స అందిస్తున్న మ్యాక్స్ హాస్పిటల్ కు వెళ్లి అతడిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.
ఆదివారం పంత్ ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరామర్శించారు. మ్యాక్స్ హాస్పిటల్ కు వచ్చిన ధామి.. పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇదిలాఉండగా పంత్ ను ప్రమాదం నుంచి రక్షించిన హరియాణా బస్ డ్రైవర్ సుశీల్ ను జనవరి 26న సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.