రోహిత్ శర్మ తన కెరీర్ చివరి టెస్టు ఆడేశాడా?
Rohit Sharma retirement: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ 3 టెస్టుల్లో ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. 2024లో టెస్టు క్రికెట్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 26 ఇన్నింగ్స్‌ల్లో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు.
Rohit Sharma Test
Rohit Sharma retirement: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయింది. భారత క్రికెట్ జట్టులో స్థానం కూడా పోయింది. గత కొంత కాలంగా టెస్టు క్రికెట్ లో పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు రోహిత్ శర్మ. దీనికి తోడు భారత జట్టు ప్రదర్శన కూడా గొప్పగా ఉండటం లేదు. ఈ క్రమంలోనే వ్యక్తిగత ఆటతీరుతో పాటు జట్టు కెప్టెన్సీతో రోహిత్ శర్మపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
చివరికి అతను కెప్టెన్సీతో పాటు భారత జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఆసీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో కెప్టెన్సీని భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కు అప్పగించారు. దీంతో రోహిత్ శర్మకు ఇక టెస్టు క్రికెట్ లో కనిపించకపోవచ్చుననే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
పేలవమైన ఫామ్‌తో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్నట్టేనా?
పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ సీనియర్ ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ, చివరి టెస్ట్ నుండి తప్పుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అతని భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించిన వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ 3 టెస్టులు ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్ ఆటలో సౌకర్యవంతంగా కనిపించలేదు. అలాగే, అతనికి తెలిసిన షాట్‌లను కూడా ఆడలేకపోయాడు. 2024లో టెస్టు క్రికెట్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 26 ఇన్నింగ్స్‌ల్లో 24.76 సగటుతో 619 పరుగులు మాత్రమే చేశాడు.
Virat Kohli-Rohit Sharma
రోహిత్ చివరిసారి టెస్టు ఆడటం చూశాను: సునీల్ గవాస్కర్
రోహిత్ చివరిసారి టెస్టు ఆడటం చూశానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సునీల్ గవాస్కర్. రెడ్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మకు మెల్‌బోర్న్ టెస్టు ఆఖరి మ్యాచ్ అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. సిడ్నీ టెస్టు తొలి రోజు సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, 'భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే, మెల్‌బోర్న్ టెస్టు రోహిత్ శర్మకు చివరి టెస్టు అవుతుంది' అని అన్నాడు.
కాగా, గత సంవత్సరం రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2024ను గెలుచుకుంది. అంతకుముందు ఏడాది వన్డే ప్రపంచ కప్ 2023లో ఫైనల్ వరకు జట్టును నడిపించాడు. అయితే, అడుగు దూరంలో టైటిల్ ను కోల్పోయింది భారత జట్టు. వన్డే, టీ20 క్రికెట్ లో మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికీ టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ ఫామ్ ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో తన 11 ఏళ్ల కెరీర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సాధించిన విజయాలను మళ్లీ అందుకోలేకపోయాడు.
రోహిత్ శర్మపై సునీల్ గవాస్కర్ కామెంట్స్ కలకలం రేపాయి
రోహిత్ శర్మ చివరి టెస్టు ఆడటం చూశానంటూ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 'ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025-27) చట్రంలో ఈ ఏడాది జూన్-జూలైలో ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. సెలెక్టర్లు 2027 ఫైనల్ ఆడగల ఆటగాడిని కోరుకుంటారు. భారత్ అక్కడికి చేరుకుంటుందా లేదా అనేది తర్వాత విషయం, అయితే ఇది సెలక్షన్ కమిటీ ఆలోచన. రోహిత్ శర్మ చివరిసారిగా టెస్ట్ ఆడటం మనం బహుశా చూశాం" అని పేర్కొన్నాడు.
సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే సిడ్నీ టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలి. ఇక్కడ జట్టు ఓడిపోతే WTC ఫైనల్ 2025కి చేరుకోవాలనే ఆశలన్నీ పోతాయి. భారత్ తదుపరి టెస్టు సిరీస్‌ను జూన్ 2025లో ఆడాల్సి ఉంది.
సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ ఎందుకు ఔట్ అయ్యాడు?
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి-ఐదో మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన టెస్టులో భారత తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్ శర్మ జట్టులో లేకపోవడం గురించి కూడా ప్రస్తావించాడు.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు మ్యాచ్ కు దూరంగా ఉంటాననీ, విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని బుమ్రా తెలిపాడు. "మా కెప్టెన్ తన నాయకత్వ సామర్థ్యాన్ని కనబరుస్తూ ఈ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్నాడు' అని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. శుభ్‌మన్ గిల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోగా, ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు ఈ సిరీస్‌లో తొలిసారి అవకాశం లభించింది. ఫామ్‌లో లేని రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్, గాయపడిన ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణలు జట్టులోకి వచ్చారు.