బెంగళూరు టెస్టు ఆడితే చాలు, నయా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు...
ఏ నిమిషాన కెప్టెన్‌గా ఎంపికయ్యాడో కాని, రోహిత్ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇప్పటిదాకా ఒక్క పరాజయం కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ శర్మ, బెంగళూరు టెస్టు ద్వారా మరో అరుదైన రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...

125 టీ20 మ్యాచులు ఆడి 4 సెంచరీలతో 3313 పరుగులు చేసి పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచులు, అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు రోహిత్ శర్మ...
వన్డే, టీ20ల్లో స్టార్ బ్యాటర్‌గా మారిన తర్వాత కూడా టెస్టుల్లో చోటు దక్కించుకోవడానికి కష్టపడిన రోహిత్ శర్మ, 2019 నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్నాడు...
టెస్టుల్లో ఓపెనర్‌గా మారిన తర్వాత సెంచరీల మోత మోగిస్తున్న రోహిత్ శర్మ, టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించబడిన తర్వాత బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకునేలా ఒక్కటి కూడా ఆడలేకపోయాడు...
మొహాలీలో జరిగిన తొలి టెస్టులో 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసి... క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి అవుటైన రోహిత్ శర్మ, బెంగళూరు టెస్టు ద్వారా రెండు అరుదైన రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు...
డే నైట్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించబోయే రెండో భారత సారథిగా నిలవబోతున్నాడు రోహిత్ శర్మ... ఇప్పటిదాకా భారత జట్టు ఆడిన మూడు డే నైట్ టెస్టుల్లోనూ విరాట్ కోహ్లీయే కెప్టెన్‌గా వ్యవహరించాడు...
అంతర్జాతీయ కెరీర్‌లో 44 టెస్టులు, 230 వన్డేలు, 125 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, బెంగళూరు టెస్టు ద్వారా 400+ మ్యాచులు ఆడిన ప్లేయర్ల జాబితాలో చేరబోతున్నాడు...
ఓవరాల్‌గా 400+ ఆడబోతున్న 34వ ప్లేయర్‌గా నిలవబోతున్న రోహిత్ శర్మ, భారత జట్టు తరుపున ఈ ఘనత సాధించబోతున్న 9వ ప్లేయర్‌గా నిలుస్తాడు...
సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచులతో టాప్‌లో ఉంటే, లంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే 652 మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు. 600+ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ప్లేయర్లు ఈ ఇద్దరు మాత్రమే...
భారత జట్టు తరుపున సచిన్ టెండూల్కర్ (664), ఎమ్మెస్ ధోనీ (538), రాహుల్ ద్రావిడ్ (509), విరాట్ కోహ్లీ (457), మహ్మద్ అజారుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402) మ్యాచులతో రోహిత్ కంటే ముందున్నారు...
ప్రస్తుతం క్రికెట్‌లో కొనసాగుతున్నవారిలో 300+ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన టీమిండియా ప్లేయర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే లిస్టులో ఉండడం విశేషం.