- Home
- Sports
- Cricket
- వన్డే నెం.1000... కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత... భారత జట్టుకి మొదటి వన్డే నుంచి...
వన్డే నెం.1000... కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత... భారత జట్టుకి మొదటి వన్డే నుంచి...
టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించబోతున్నాడు. విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వెస్టిండీస్ సిరీస్ ద్వారా నయా సారథిగా బాధ్యతలు చేపబట్టబోతున్నాడు రోహిత్ శర్మ...

పూర్తి స్థాయి భారత జట్టు వన్డే సారథిగా రోహిత్ శర్మ ఆడబోయే మొట్టమొదటి మ్యాచ్... టీమిండియాకి 1000వ వన్డే కావడం విశేషం. మైలురాయి మ్యాచ్ ద్వారా వన్డే సారథిగా రోహిత్ కెరీర్ ప్రారంభించబోతున్నాడు...
1932లో భారత క్రికెట్ జట్టు టెస్టు ప్రస్థానం మొదలైంది. భారత మాజీ క్రికెటర్ కొట్టారి కనకయ్య నాయుడు, టీమిండియాకి మొట్టమొదటి కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయారు...
ఆ తర్వాత ఇఫ్తికర్ ఆలీ ఖాన్ పటౌడీ, లాలా అమర్‌నాథ్, విజయ్ హాజారే, వినూ మన్కడ్, గులామ్ అహ్మద్, పాలీ ఉమ్రిగర్, హేమూ అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, గులాబ్‌రాయ్ రామ్‌చంద్, నరీ కాంట్రాక్టర్, మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ, చందూ బార్డే వంటి ఎందరో భారత టెస్టు క్రికెట్‌కి కెప్టెన్లుగా వ్యవహరించారు...
1970లో భారత టెస్టు సారథిగా బాధ్యతలు తీసుకున్న అజిత్ వాడేకర్, టీమిండియాకి మొట్టమొదటి వన్డే కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... 1974లో ఇంగ్లాండ్‌తో మొట్టమొదటిసారి వన్డే సిరీస్‌లో పాల్గొంది భారత జట్టు...
అజిత్ వాడేకర్ తర్వాత శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ వంటి కెప్టెన్లు... టీమిండియాకి వన్డే సారథులుగానూ వ్యవహరించారు...
టీమిండియా మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు 100వ వన్డే మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో 200వ వన్డే మ్యాచ్ ఆడింది...
కెప్టెన్‌గా పెద్దగా విజయాలు అందుకోలేకపోయినా తన షార్ట్ కెప్టెన్సీ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ కూడా ఈ అరుదైన మైలురాళ్ల జాబితాలో చేరాడు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత జట్టు 300వ వన్డే మ్యాచ్‌లో పాల్గొంది...
టెండూల్కర్ నుంచి మళ్లీ పగ్గాలు తీసుకున్న భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియా 400వ వన్డే మ్యాచ్ ఆడింది...
2003 ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టుని ఫైనల్ చేర్చిన సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా 500వ వన్డే మ్యాచ్‌లో పాల్గొంది...
భారత మాజీ ఓపెనర్, విధ్వంసక బ్యాట్స్2మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీలో 600వ వన్డే మ్యాచ్ ఆడింది భారత జట్టు. ఆ తర్వాత మాహీ కెప్టెన్సీ శకం మొదలైంది...
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోనే 700వ, 800వ, 900వ వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన కెరీర్‌లో కెప్టెన్‌గా 200 వన్డేలు ఆడిన ఎమ్మెస్ ధోనీ, భారత జట్టుకి అత్యధిక వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన కెప్టెన్‌గా ఉన్నాడు...
సౌతాఫ్రికా టూర్‌కి ముందు వన్డే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 95 వన్డేలకు కెప్టెన్సీ చేశాడు. సెలక్టర్లు, విరాట్‌ను వన్డే సారథిగా తప్పించడంతో చారిత్రక 1000వ వన్డేతో పాటు కెప్టెన్‌గా 100 వన్డేలు ఆడే కెప్టెన్‌గా నిలిచే రికార్డులను కోల్పోయాడు...
రోహిత్ శర్మ కెప్టెన్సీలో 1000వ వన్డే ఆడబోతున్న భారత జట్టు ఇప్పటిదాకా... 999 వన్డేల్లో 518 విజయాలు అందుకుంది. 431 మ్యాచుల్లో ఓడగా, 9 వన్డేలు టైగా ముగిశాయి. 41 వన్డేల్లో వివిధ కారణాల వల్ల ఫలితం తేలకుండానే రద్దయ్యాయి...
ఆస్ట్రేలియా తర్వాత 500+ వన్డేల్లో విజయాలు అందుకున్న రెండో జట్టుగా నిలిచిన భారత జట్టు, వెయ్యి వన్డేలు ఆడబోతున్న మొదటిజట్టుగా నిలవనుంది. ఆస్ట్రేలియా 958 వన్డేలు, పాకిస్తాన్ 936 వన్డేలతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి...