- Home
- Sports
- Cricket
- Rohit Sharma: కోహ్లి కంటే హిట్ మ్యానే బెస్ట్ కెప్టెన్ : టీమిండియా మాజీ ఓపెనర్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma: కోహ్లి కంటే హిట్ మ్యానే బెస్ట్ కెప్టెన్ : టీమిండియా మాజీ ఓపెనర్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Vs Virat Kohli: వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా నయా సారథి రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. టీమిండియా మాజీ సారథి కోహ్లి కంటే అతడే ఉత్తమ కెప్టెన్ అని..

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి, నయా సారథి రోహిత్ శర్మ ఎవరికి వారే ప్రత్యేకం. భారత క్రికెట్ కు గత దశాబ్దకాలంగా సేవలందిస్తున్న ఈ వెటరన్స్ లో ఎవరు గొప్ప అనేది..? ఇప్పటికీ వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుపుతూనే ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ మాటల యుద్ధానికి మరింత హీట్ పెంచాడు భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్. అతడు స్పందిస్తూ.. కోహ్లి కంటే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
జాఫర్ స్పందిస్తూ.. ‘నా దృష్టిలో అయితే కోహ్లి కంటే రోహిత్ శర్మనే ఉత్తమ సారథి అని నేను అనుకుంటున్నాను. హిట్ మ్యాన్ ఇంకెన్ని టెస్టులు ఆడతాడో నాకు తెలియదు.
కానీ మ్యాచులలో వ్యూహాలు, మ్యాచ్ లో సందర్బానికి తగినట్టు నిర్ణయాలు తీసుకోవడంలో అతడు బెస్ట్ కెప్టెన్ అని మాత్రం నేను చెప్పగలను. గత కొన్ని రోజులుగా అందుకు సంబంధించిన ఫలితాలను కూడా మనమంతా చూస్తున్నాం.
రోహిత్ కెప్టెన్సీ తీసుకున్నప్పట్నుంచి అతడు సారథ్యం వహించిన ఒక్క మ్యాచులో కూడా భారత జట్టు ఓడిపోలేదు. నాకు సంబంధించినంతవరకు.. భారత జట్టు కెప్టెన్సీ సరైన వ్యక్తి చేతుల్లో సురక్షితంగా ఉందని నేను భావిస్తున్నాను..’ అని అన్నాడు.
అయితే ఇది కోహ్లి ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. భారత జట్టుకు టెస్టులలో అత్యధిక విజయాలు అందించిన సారథిగా విరాట్ కు తిరుగులేని రికార్డుంది. 68 టెస్టులలో విరాట్ భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించగా.. అందులో 40 విజయాలు దక్కాయి. వన్డే, టీ20లలో కూడా అతడి విజయాల శాతం 60 శాతం పైమాటే.. వీటిని చూపెడుతూ.. జాఫర్ కు గణాంకాలు కనిపించడం లేదా..? అని చురకలంటిస్తున్నారు.
కోహ్లి సంగతి అలా ఉంటే.. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టినప్పట్నుంచి ప్రతి మ్యాచులో విజయమే వరించింది. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తో పాటు.. విండీస్ తో వన్డే, టీ20.. లంకతో టీ20, రెండు టెస్టులలో టీమిండియాదే విజయం. దీంతో వరుసగా 14 మ్యాచులు (ఫార్మాట్ లతో సంబంధం లేకుండా) గెలిచిన కెప్టెన్ గా రోహిత్ రికార్డులు సృష్టించాడు.
టెస్టులు, వన్డేలు, టీ20లలో ఎన్ని మ్యాచులు గెలిచినా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం కోహ్లి కెప్టెన్సీ కెరీర్ కు పెద్ద దెబ్బ. గతేడాది నిర్వహించిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్ ను తీసుకొచ్చిన కోహ్లి.. ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ ను గెలిపించలేకపోయాడు.
అయితే కెప్టెన్ గా కోహ్లి రికార్డులను అధిగమించడం (40 విజయాలు) రోహిత్ కు సాధ్యం కాకపోవచ్చు గానీ ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ లలో ఏ ఒక్కటి దక్కినా అది కోహ్లిపై పైచేయి సాధించినట్టేనని హిట్ మ్యాన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.