- Home
- Sports
- Cricket
- వాగేవాళ్లు ఏదైనా వాగుతారు.. నేను పట్టించుకోను.. విమర్శలపై ధీటుగా బదులిచ్చిన ముంబై ఓపెనర్
వాగేవాళ్లు ఏదైనా వాగుతారు.. నేను పట్టించుకోను.. విమర్శలపై ధీటుగా బదులిచ్చిన ముంబై ఓపెనర్
Ishan Kishan: ఐపీఎల్ -15 కు ముందు జరిగిన వేలంలో అత్యంత ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్ ఈ సీజన్ లో అనుకున్న మేర రాణించలేదు. ఈ నేపథ్యంలో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడికి అంత ధర పెట్టి కొనుగోలు చేయడం వృథా ప్రయాస అని కామెంట్స్ వినిపించాయి.

ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాక్ కిషన్ ఈ ఏడాది వేలంలో దక్కిన అత్యధిక ధర (రూ. 15. 25 కోట్ల) వల్లే సరిగా రాణించలేకపోతున్నాడన్నది తరుచుగా వినిపిస్తున్న విమర్శ. ధర ఒత్తిడి వల్లే ఇషాన్ విఫలమవుతున్నాడని, అదే అతడి ఫామ్ ను దెబ్బతీసిందని షేన్ వాట్సన్ తో పాటు చాలా మంది విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
తాజాగా ఇషాన్ ఈ విమర్శలపై ధీటుగా బదులిచ్చాడు. విమర్శలు చేసేవాళ్లు చేస్తూనే ఉంటారని తాను మాత్రం వాటిని పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. అత్యధిక ధర ఒత్తిడిని ఎదుర్కోవడానికి టీమిండియా తాజా మాజీ సారథులు తనకు విలువైన సలహాలిచ్చారని అన్నాడు.
తాజాగా ఓ జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి మహా అయితే వేలం తర్వాత రెండు మూడు రోజులు ఉంటుంది. గ్రౌండ్ లోకి దిగామంటే అవన్నీ ఏమీ గుర్తుకురావు. అప్పుడు నా దృష్టంతా మా జట్టు విజయం.. నా ఆట మీదే ఉంటాయి..
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడి మీద ఒత్తిడి అనేది సహజమే. కానీ మన చుట్టూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉంటే దానిని అధిగమించడం అంత పెద్ద విషయమేమీ కాదు. నాకు ఆ విషయంలో టీమిండియా సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లతో పాటు హార్ధిక్ పాండ్యాలు చాలా సహాయం చేశారు.
ఇదే విషయం గురించి నేను రోహిత్, విరాట్ తో చర్చించినప్పుడు వాళ్లంతా ఒకటే చెప్పారు. ‘‘నువ్వు ప్రైస్ ట్యాగ్ గురించి వదిలేయ్.. నీ ఆట మీద దృష్టి పెట్టు’’ అని నాతో అన్నారు. ఎందుకంటే అది నేను ఎవర్నీ అడగలేదు
నా జట్టు నన్ను నమ్మింది. దానికి న్యాయం చేయాలి. నా మైండ్ లో ఉండేదదే. సీనియర్ ప్లేయర్లతో మాట్లాడటం వల్ల నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఎందుకంటే వాళ్లు ఇలాంటి ఎన్నో అవరోధాలు, అడ్డంకులను అధిగమించినవారు. వాళ్ల అనుభవాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి. ప్రైస్ ట్యాగ్ అనేది నేను అసలు పట్టించుకోలేదు. అది నాకు సెకండరీ...’ అని చెప్పుకొచ్చాడు.
అంతేగాక తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘సార్, ఫోన్ తీసుకుని సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేవాళ్లు చాలా మంది ఉన్నారు. నేను వాటిని పట్టించుకోలేదు.
అసలు ఇంతవరకు నేను ఆ కామెంట్లను చూడటం కూడా చూడలేదు. వాళ్ల గురించి నేను అసలు పట్టించుకోను. ఒకవేళ వాళ్ల (విమర్శకులకు) కు అలా రాయడమే బాగుందని అనిపిస్తే అది వాళ్ల ఇష్టం. నేనేమీ బాధపడను..’అని కుండబద్దలు కొట్టాడు. ఈ సీజన్ లొో ఇషాన్ కిషన్ 11 మ్యాచులాడి 321 పరుగులు చేశాడు.