- Home
- Sports
- Cricket
- ఒక్కసారి టీమ్‌ను సెలక్ట్ చేస్తే అదే ఫైనల్.. విమర్శలకు తావు లేదు : గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఒక్కసారి టీమ్‌ను సెలక్ట్ చేస్తే అదే ఫైనల్.. విమర్శలకు తావు లేదు : గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
T20I World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఆడబోయేందుకు గాను 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వచ్చే నెల ఆస్ట్రేలియాలో జరుగబోయే పొట్టి ప్రపంచకప్ కోసం 15మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్టర్లు ఇటీవలే ఎంపిక చేశారు. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ఈ జట్టు ఎంపికలో మహ్మద్ షమీ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షమీని స్టాండ్ బై ప్లేయర్ గా కాకుండా 15మంది సభ్యులతో పాటు ఎంపిక చేస్తే బాగుండేదని.. అంతేగాక టీ20లలో సరిగా రాణించని రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ ను తీసుకుని ఉండాల్సిందని విమర్శలు వస్తున్నాయి.
అయితే ఈ విమర్శలపై తాజాగా టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. సెలక్టర్లు ఒకసారి జట్టును ఎంపిక చేస్తే అందులో తప్పులు వెతకాల్సిన పన్లేదని.. జట్టుకు మద్దతుగా నిలబడాలని అన్నాడు.తాను కూడా షమీని 15 మంది సభ్యులలో ఎంపిక చేయనందుకు బాధపడుతున్నా దానిగురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ ల కోసం ఎంపిక చేసిన భారత జట్టు.. ట్రోఫీని తిరిగి భారత్ కు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. రోహిత్ అండ్ కో. ప్రతి జట్టుకు ఉండాల్సిన కాస్త అదృష్టం కూడా ఉంది. ఒకసారి జట్టును ఎంపిక చేసినాక ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సరే అది మన టీమిండియా. ఆ టీమ్ కు మనం మద్దతుగా నిలబడాలి. జట్టులో ఎంపికలు, తీసివేతల గురించి మాట్లాడితే ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బతింటుంది..’ అని అన్నాడు.
ఇక ఇదే విషయమై మాజీ ఆటగాడు, సెలక్టర్ గా పనిచేసిన శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత జట్టును నేను ఎంపిక చేయాల్సి వస్తే.. మహ్మద్ షమీ తో పాటు ఉమ్రాన్ మాలిక్, శుభమన్ గిల్ లను కూడా ఎంపిక చేసేవాడిని. ఈ ముగ్గురూ ఐపీఎల్ లో బాగా ఆడారు....’అని అన్నాడు.
అంతకుముందు మహ్మద్ అజారుద్ధీన్ స్పందిస్తూ.. ‘టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టును చూసి ఆశ్చర్యానికి గురయ్యా. మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్ లు మేయిన్ టీమ్ లో ఉండాల్సినవాళ్లు. దీపక్హుడా, హర్షల్ పటేల్ ల స్థానంలో వారిని ఎంపిక చేసి ఉండాల్సింది..’అని వ్యాఖ్యానించాడు.
విమర్శల నేపథ్యంలో సన్నీ..రోహిత్ శర్మ జట్టుకు అండగా నిలబడ్డాడు. అక్టోబర్ 16నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవాల్సి ఉండగా.. మొదలు అర్హత మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 23న భారత జట్టు..పాకిస్తాన్ తో తొలిపోరులో తలపడనుంది.
టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.. స్టాండ్ బై ప్లేయర్లు : మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్