నో షేక్ హ్యాండ్ వివాదం : భారత్–పాక్ హాకీ ఆటగాళ్ల మధ్య హై ఫైవ్
India and Pakistan hockey: ఆసియా కప్‌లో హ్యాండ్‌షేక్ వివాదం తర్వాత మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ మ్యాచ్‌కు ముందు భారత్–పాక్ జూనియర్ హాకీ జట్లు హై-ఫైవ్‌తో ఆశ్చర్యపరిచాయి.

నో షేక్ హ్యాండ్.. సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్‌లో ఇండియా vs పాకిస్తాన్
మలేషియాలోని జోహోర్ బహ్రూలో మంగళవారం జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ అండర్–21 హాకీ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభానికి ముందు హై-ఫైవ్ చేసుకున్నారు. గత కొద్ది వారాలుగా క్రికెట్‌లో రెండు జట్ల మధ్య హ్యాండ్‌షేక్ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ స్నేహపూర్వక జెష్చర్ రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలకు సానుకూల సంకేతంగా నిలిచింది.
జాతీయ గీతాల తర్వాత హై ఫైవ్
రెండు జట్ల జాతీయ గీతాలు పూర్తయ్యాక భారత జూనియర్ ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టువైపు నడిచి, ఆట ప్రారంభానికి ముందు ప్రతి ఆటగాడితో హై-ఫైవ్‌లు చేసుకున్నారు. గత నెల ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయకుండా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య ప్రత్యేకంగా నిలిచింది.
అలాగే, మహిళల ప్రపంచకప్‌లో కూడా రెండు దేశాల మహిళా జట్లు ప్రీ-మ్యాచ్, పోస్ట్-మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ కు నిరాకరించాయి. అయితే హాకీ ఆటగాళ్ల ఈ స్నేహపూర్వక తీరు క్రీడా విలువలను ప్రతిబింబించింది.
Pakistan and India players shook hands before their match at the Sultan of Johor Hockey Cup today 🇵🇰🤝🇮🇳
Surya Kumar Yadav & BCCI should learn something from this ‼️ pic.twitter.com/siB9HxRElk— Muzammal Shah (@imuzammalshah) October 14, 2025
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ సూచనలు
మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (PHF) తన ఆటగాళ్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేయకపోయినా, ఏ విధమైన స్పందనలు ఇవ్వకుండా మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని ఆదేశించింది. పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ కు చెందిన అధికారి మాట్లాడుతూ.. “భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేయకపోతే దానిని పట్టించుకోకండి. ఎలాంటి భావోద్వేగ ప్రతిస్పందనలు చేయకండి. మీ ఆటపై దృష్టి పెట్టండి” అని చెప్పినట్టు తెలిపారు.
ఆసియా కప్ 2025 లో వివాదం ఏంటి?
ఆసియా కప్ సమయంలో భారత పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయకపోవడం వివాదంగా మారింది. టాస్ సమయంలో, మ్యాచ్ అనంతరం కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు చేతులు కలపలేదు. ఆ ఘటన పాకిస్తాన్‌లో ఆగ్రహం రేపింది. ఐసీసీ కి ఫిర్యాలు చేయడం వరకు చేరింది.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ నిర్ణయం పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితం చేశామని తెలిపారు. కానీ ఈ వివరణను పాకిస్తాన్ రాజకీయ ఉద్దేశాలతోకూడినదిగా విమర్శించింది.
ఆ తర్వాత పాకిస్తాన్ ఐసీసీకి అధికారిక ఫిర్యాదు చేయగా, భారత జట్టు కూడా హారిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌ల ప్రవర్తనపై ఫిర్యాదు చేసింది. రౌఫ్ జెట్ క్రాషింగ్ సిగ్నల్ చేయడం, ఫర్హాన్ రైఫిల్ మైమిక్ చేయడం పై భారత ప్లేయర్లకు ఆగ్రహం తెప్పించింది.
మరో వివాదం రేపిన ఆసియా కప్ ట్రోఫీ
ఆసియా కప్ లో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. అయితే, ఈ టోర్నీ ముగింపులో కూడా వివాదం చోటుచేసుకుంది. భారత ఆటగాళ్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఏసీసీ చైర్మన్ మోహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించడానికి నిరాకరించారు. దీంతో ట్రోఫీ ప్రదాన కార్యక్రమం ఆలస్యమై, చివరికి ట్రోఫీని వేదిక నుండి తీసివేయాల్సి వచ్చింది.
ఈ క్రికెట్ వివాదాల అనంతరం, సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్‌లో రెండు దేశాల జూనియర్ హాకీ ఆటగాళ్లు చూపించిన స్నేహ హావభావం కొత్త ఆశలు కలిగించింది. రెండు దేశాల మధ్య క్రీడా వేదికలపై సానుకూల వాతావరణం పునరుద్ధరించడానికి ఈ చర్యలు చిన్నివే అయినా.. ప్రాధాన్యతగల అడుగని క్రీడాభిమానులు భావిస్తున్నారు.---
మొత్తం చూస్తే, హ్యాండ్‌షేక్ వివాదాల మధ్య మలేషియాలో హై-ఫైవ్‌లతో భారత్–పాక్ యువ ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని నిలబెట్టారు. ఈ సంఘటన భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలను మరింత సానుకూల దిశగా నడిపే అవకాశం కల్పించింది.