- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌తో పోలికా! మార్కెట్ క్రియేట్ చేసిందే మేము... పాక్ జర్నలిస్టుకి రాబిన్ ఊతప్ప కౌంటర్...
ఐపీఎల్‌తో పోలికా! మార్కెట్ క్రియేట్ చేసిందే మేము... పాక్ జర్నలిస్టుకి రాబిన్ ఊతప్ప కౌంటర్...
ఐపీఎల్, ప్రపంచంలో అతి పెద్ద క్రీడా లీగుల్లో ఒకటిగా ఆవిర్భవించింది. వేల కోట్ల ఆదాయాన్ని గడించిపెడుతూ, బీసీసీఐకి కామధేనువులా మారిన ఐపీఎల్ గురించి పాక్ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. భారత క్రికెట్ ఫ్యాన్స్ నుంచి రివర్స్ పంచ్‌లు తింటూనే ఉన్నారు...

పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా... ‘ఐపీఎల్ మాదిరిగా, పీఎస్‌ఎల్‌లో వేలం పద్ధతి ప్రవేశపెడితే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఏ క్రికెటర్ ముందుకు రాడు...’ అంటూ కామెంట్లు చేయడంతో ఐపీఎల్ వర్సెస్ పీఎస్‌ఎల్ మీద చర్చ మొదలైంది...
ఇప్పటికే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ క్రికెటర్లు... ప్రపంచంలో ఐపీఎల్‌ని మించిన మరో లీగ్ లేదని తేల్చేసి చెప్పేశారు. పీఎస్‌ఎల్ కాదు కదా, బీబీఎల్ కూడా ఐపీఎల్‌తో పోటీపడలేదని తేల్చేశారు...
ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు రిటైన్ చేసుకున్నందుకు రూ.4 కోట్లు చెల్లిస్తుంటే, పీఎస్‌ఎల్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ తీసుకునే మొత్తం రూ.3 కోట్లే... ఇదే భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి కోపాన్ని, ఆగ్రహాన్ని తెప్పించింది...
‘ఒకవేళ నువ్వు అన్నట్టే డ్రాఫ్ట్ పద్ధతిలో కాకుండా పాక్ సూపర్ లీగ్‌లో వేలం సిస్టమ్ ప్రవేశపెట్టారనే అనుకుందాం... మీ దగ్గర రూ.16 కోట్ల ప్లేయర్‌ను చూడగలమా?
పాక్ బోర్డుకి కానీ, పీఎస్‌ఎల్‌కి గానీ అంత సీన్ లేదు. మీ దగ్గర అంత మార్కెట్ కూడా లేదు. కాబట్టి ఎప్పుడూ ఏ విషయంలోనూ ఐపీఎల్‌తో పోల్చుకోకండి...
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే గత ఏడాది క్రిస్ మోరిస్, ఐపీఎల్‌లో వేసిన ఒక్కో బంతికి తీసుకున్న మొత్తం... మిగిలిన లీగ్స్‌లో ఖరీదైన ఆటగాడికి ఇచ్చే మొత్తం కంటే ఎక్కువే...’ అంటూ గట్టి సమాధానం ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...
తాజాగా అర్జా ఫిరోజ్ జాక్ అనే పాక్ జర్నలిస్టు... ‘ఐపీఎల్‌కీ, పీఎస్‌ఎల్‌కీ మధ్య పోలికలు తేకండి. పీఎస్ఎల్ 2016లో ఆరంభమైంది, ఐపీఎల్ 2008లోనే మొదలైంది...
పీఎస్‌ఎల్, ఐపీఎల్ కంటే వేగంగా పాపులారిటీ దక్కించుకుంది. ఐపీఎల్ పుట్టినప్పుడు మార్కెట్‌లో దానికి పోటీగా మరో లీగ్ లేదు...’ అంటూ ట్వీట్ చేశాడు...
దానికి స్పందించిన భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప... ‘నువ్వు అంటున్న ఆ మార్కెట్‌ని క్రియేట్ చేసిందే ఐపీఎల్...’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు...