టీ20 ప్రపంచకప్‌లలో శతక్కొట్టిన వీరులు వీళ్లే.. చెక్కు చెదరని విండీస్ వీరుడి రికార్డు
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్ మధ్య ముగిసిన మ్యాచ్ లో సఫారీలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ప్రొటీస్ బ్యాటర్ రిలీ రొసోవ్ సెంచరీ బాదాడు.
Image credit: Getty
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా సిడ్నీ లో ముగిసిన దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్ మధ్య ముగిసిన మ్యాచ్ లో సఫారీ బ్యాటర్ రిలీ రొసోవ్ సెంచరీ బాదాడు. రొసోవ్.. 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా రొసోవ్.. ఐసీసీ టీ20 టోర్నీలలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ లలో సెంచరీ కొట్టిన వీరులెవరో ఇక్కడ చూద్దాం.
రిలీ రొసోవ్ చేసిన శతకం పొట్టి ప్రపంచకప్ టోర్నీ (8వ ఎడిషన్) లో పదోవది. ఇంతకుముందు ఏడు ఎడిషన్లలో సెంచరీలు చేసిన వారి జాబితాలో క్రిస్ గేల్, సురేశ్ రైనా, మహేళ జయవర్దెనే, బ్రెండన్ మెక్‌కల్లమ్, అలెక్స్ హేల్స్, అహ్మద్ షాజాద్, తమీమ్ ఇక్బాల్, జోస్ బట్లర్ లు ఉన్నారు.
Chris Gayle
టీ20 ప్రపంచకప్ లో తొలి సెంచరీ నమోదైంది ప్రారంభ ఎడిషన్ లోనే.. 2007లో యూనివర్సల్ బాస్, విండీస్ వీరుడు క్రిస్ గేల్.. సౌతాఫ్రికా మీద 57 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆ తర్వాత అతడు 2016లో ఇంగ్లాండ్ మీద కూడా సెంచరీ చేశాడు. టీ20 ప్రపంచకప్ లో రెండు సెంచరీలు చేసిన ఘనత గేల్ పేరిటే ఉంది. ఇప్పటికీ ఈ రికార్డు చెరిగిపోలేదు.
ఈ మెగా టోర్నీలో రెండో సెంచరీ చేసింది టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా. 2010 ఎడిషన్ లో రైనా.. సౌతాఫ్రికా మీద 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
శ్రీలంక మాజీ సారథి మహేళ జయవర్దెనే కూడా 2010 ఎడిషన్ లోనే శతక్కొట్టాడు. మహేళ.. జింబాబ్వే మీద ఈ ఘనత సాధించాడు. 64 బంతుల్లోనే జయవర్దెనే సెంచరీ పూర్తయింది.
న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్‌కల్లమ్.. 2012 ఎడిషన్ లో బంగ్లాదేశ్ మీద వంద కొట్టాడు. 58 బంతుల్లోనే మెక్‌కల్లమ్.. 123 పరుగులు చేశాడు.
2014 ఎడిషన్ లో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్.. శ్రీలంక మీద వంద పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్ లో హేల్స్.. 64 బంతుల్లోనే (116 నాటౌట్) సెంచరీ కొట్టాడు. ఇదే ఎడిషన్ లో పాకిస్తాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్.. బంగ్లాదేశ్ మీద వంద పరుగులు సాధించాడు.
ఇక 2016 ఎడిషన్ లో బంగ్లా బ్యాటర్ తమీమ్ ఇక్బాల్.. ఓమన్ మీద సెంచరీ కొట్టాడు. ఇదే ఎడిషన్ లో గేల్.. ఇంగ్లాండ్ మీద శతక్కొట్టాడు.
2021 ఎడిషన్ లో ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్.. శ్రీలంక మీద మెరుపులు మెరిపించి సెంచరీ చేశాడు. బట్లర్.. 67 బంతుల్లోనే 101 పరుగులతో ఇంగ్లాండ్ కు భారీ స్కోరు అందించాడు. తాజాగా ఈ జాబితాలో రిలీ రొసోవ్ కూడా చేరాడు.