Richa Ghosh : విశాఖలో రిచా ఘోష్ సెన్సేషన్..
Richa Ghosh : విశాఖలో సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో రిచా ఘోష్ 94 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడారు. భారత్ కష్ట సమయంలో ఉండగా కీలక నాక్ ఆడారు. మహిళల వరల్డ్ కప్‌లో కొత్త రికార్డులు సాధించారు.

వైజాగ్ లో రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్
వైజాగ్ లో రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడారు. విశాఖలో కొత్త చరిత్ర సృష్టించారు. అక్టోబర్ 9న జరిగిన మహిళల ప్రపంచ కప్ 2025 మూడవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ 102/6 పరుగులతో కష్టాల్లో పడ్డ సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ 77 బంతుల్లో 94 పరుగులు సూపర్ నాక్ ఆడారు. ఆమె అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ 251 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
రిచా ఘోష్ ఇన్నింగ్స్ మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లలో అత్యధిక స్కోర్‌ను సాధించింది. అంతకుముందు, ఈ రికార్డును 2022 ప్రపంచ కప్‌లో పూజా వస్త్రకర్ 67 పరుగులతో సాధించారు.
రిచా ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. భారత జట్టు ప్రారంభంలో వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత రిచా తన ధనాధన్ నాక్ తో విశాఖ ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం నింపింది.
జాగ్రత్తగా మొదలు పెట్టి.. దూకుడు పెంచిన రిచా ఘోష్
భారత్ 102/6 వద్ద ఉన్నప్పుడు రిచా ఘోష్, అమంజోత్ కౌర్‌తో కలిసి క్రీజులోకి వచ్చింది. ప్రారంభంలో ఆరు బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా రాలేదు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్ క్లోయే ట్రయాన్ ఓవర్ లో లాంగ్ ఆన్ వైపు బౌండరీ కొట్టి స్కోరింగ్ మొదలుపెట్టింది.
తర్వాతి ఓవర్ లో కూడా బౌండరీ కొట్టి తన బ్యాటింగ్ దూకుడును కొనసాగించింది. అమంజోత్ కౌర్‌తో కలిసి 84 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం అందించి భారత స్కోర్ బోర్డును 150 పరుగులు దాటించారు.
స్నేహ్ రాణాతో రిచా కీలక భాగస్వామ్యం
అమంజోత్ ఔటైన తర్వాత రిచా, స్నేహ్ రాణాతో కలిసి చివరి 10 ఓవర్లలో మరింత దూకుడుగా ఆడింది. ఇద్దరి మధ్య 53 బంతుల్లో 88 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొంది. ఇది భారత మహిళల జట్టు ఎనిమిదో వికెట్ కు అత్యధిక భాగస్వామ్య రికార్డుగా నిలిచింది.
ఖాకా బౌలింగ్‌లో రిచా రెండు బౌండరీలు, ఒక సిక్స్ కొట్టి తన బ్యాట్ పవర్ చూపించింది. ఆ తర్వాత నదీన్ డి క్లెర్క్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి తన స్కోరును 90లకు తీసుకొచ్చింది.
సెంచరీ మిస్.. కానీ, చరిత్ర సృష్టించిన రిచా ఘోష్
రిచా ఘోష్ 100 పరుగులకు కేవలం ఆరు పరుగుల దూరంలో ఉండగా, నదీన్ డి క్లెర్క్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ వద్ద క్యాచ్‌గా అవుట్ అయింది. అయినప్పటికీ, 94 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్‌ను కష్టాల్లోంచి రక్షించింది. 26 ఓవర్లలో 102/6 నుండి చివరికి 251 పరుగులకు చేర్చడంలో రిచా ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.
మ్యాచ్‌లో నమోదైన రికార్డులు, మైలురాళ్లు ఇవే
• 94 పరుగులు: రిచా ఘోష్ అద్భుతమైన నాక్.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసి మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచింది.
• 1000 పరుగులు: రిచా ఘోష్ మహిళల వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన 12వ భారతీయ ప్లేయర్ గా ఘనత సాధించారు.
• 1010 బంతుల్లో 1000 పరుగులు: తక్కువ బంతుల్లో ఈ మైలురాయిని చేరిన మూడవ ప్లేయర్ రిచా ఘోష్
• 88 పరుగుల భాగస్వామ్యం: రాణా, రిచా జంట ఎనిమిదో వికెట్ కు రికార్డు భాగస్వామ్యం
• స్మృతి మంధాన: ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన మహిళా ప్లేయర్ (982)గా రికార్డు