ఆ విధ్వంసం పేరు రింకూ సింగ్.. అసాధ్యం సుసాధ్యమైందిలా.. ఆటో డ్రైవర్ కొడుకా మజాకా
Rinku Singh: గుజరాత్ - కోల్కతా మ్యాచ్ లో16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోరు 155-4. 17వ ఓవర్లో కోల్కతాకు ఊహించని షాక్. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీశాడు. కానీ అప్పుడు గుజరాత్ కు తెలియదు.. విధ్వంసం ఆఖరి ఓవర్లో జరుగుతుందని..!

గుజరాత్ టైటాన్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లో భాగంగా ఆటో డ్రైవర్ కొడుకు అద్భుతం చేశాడు. చేయాల్సింది 205 పరుగుల భారీ స్కోరు. గుజరాత్ బౌలర్లను ఉతికారిసేన వెంకటేశ్ అయ్యర్ ఔటైనా రసెల్, నరైన్ లు ఉన్నారనే ధీమా. వీళ్లిద్దరూ ఆడకపోయినా శార్దూల్ ఠాకూర్ అయినా గెలిపించకపోతాడా..? అన్న నమ్మకం.
Image credit: PTI
16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోరు 155-4. 17వ ఓవర్లో కోల్కతాకు ఊహించని షాక్. గుజరాత్ స్టాండ్ ఇన్ స్కిప్పర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీశాడు. రసెల్, నరైన్, శార్దూల్ ఔట్. ఉన్నవి 3 ఓవర్లు.. చేయాల్సిన పరుగులు 47. షమి వేసిన 18వ ఓవర్లో ఐదు పరుగులే వచ్చాయి. జోషువా లిటిల్ వేసిన 19వ ఓవర్ల 14 పరుగులు రాబట్టింది కేకేఆర్.
అసలు డ్రామా అంతా ఆఖరి ఓవర్లోనే మొదలైంది. యశ్ దయాల్ చేతిలో బంతి. కేకేఆర్ చేయాల్సింది 6 బంతుల్లో 29 పరుగులు. తొలి బంతికి ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూసింగ్ కు ఇచ్చాడు. అప్పుడు మొదలైంది విధ్వంసం. మ్యాచ్ మాదే అని గుండెల మీద చేయి వేసుకున్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు, అభిమానుల గుండెలు అదిరేలా ఒకడు చెలరేగిపోయాడు.
Image credit: PTI
యశ్ దయాల్ వేసిన 19వ ఓవర్లో రెండో బంతి ఫుల్ టాస్.. బాల్ వెళ్లి ప్రేక్షకుల మధ్యలో పడింది. మూడో బాల్ కూడా ఫుల్ టాస్. రిజల్ట్ సేమ్. రెండు సిక్సర్లు కొట్టినా యశ్ దయాల్ మారలేదు. నాలుగో బంతిని మళ్లీ ఫుల్ టాస్ వేశాడు. ఈసారీ రింకూ గురి తప్పలేదు. లక్ష్యం కరిగిపోయింది. చేయాల్సింది రెండు బంతుల్లో పది పరుగులు.
Image credit: PTI
ఐదో బంతిని కాస్త వణుక్కుంటూనే స్లో గా విసిరాడు యశ్. నువ్వు ఎలాగేసినా నాకు తెలిసింది బాదడం ఒక్కటే అన్నట్టుగకా లాంగాన్ మీదుగా భారీ సిక్సర్. ఇక ఆఖరు బంతి .. నాలుగు పరుగులు చేస్తే విజయం. ఆ బంతి వేసేముందు గిల్, రషీద్ ఖాన్, షమీ, డేవిడ్ మిల్లర్ లతో యశ్ చర్చలు. భయపడుకుంటూనే బాల్ విసిరాడు యశ్. స్టేడియంలో జనాలు, ఆటగాళ్లు, టీవీల ముందు చూస్తున్న ప్రేక్షకులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే బాల్ వెళ్లి స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకుల మధ్య పడింది.
Image credit: PTI
అంతే.. అది విధ్వంసానికి ముగింపు. ఏదో అద్భుతం జరిగిందని గుజరాత్ ఆటగాళ్లు తెలుసుకునేలోపే కేకేఆర్ ఆటాగాళ్లు రింకూ సింగ్ ను చుట్టుముట్టారు. రెండు వందల పరుగుల భారీ లక్ష్యాన్ని.. అది అసాధ్యమైన పరిస్థితుల్లో ఛేదించిన రింకూను మనసారా అభినందించారు. యశ్ దయాల్ నేల మీద పడిపోయి దిగాలుగా ఏం జరిగిందో తెలియక తల పట్టుకున్నాడు. గుజరాత్ ఆటగాళ్ల పరిస్థితి ఇంచుమించు అదే విధంగా ఉంది.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత నెట్టింట రింకూ సింగ్ పేరు మార్మోగిపోతున్నది. చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విటర్ ఖాతా వేదికగా.. ‘రింకూ సింగ్.. రిమెంబర్ ది నేమ్’ అని ట్వీట్ చేసింది. చాలా మంది ట్విటర్ యూజర్లు ఇదే ట్వీట్ చేస్తున్నారు.
1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్ లొని అలీగఢ్ లో పుట్టిన రింకూ సింగ్.. 2017 లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ ఏడాది సరిగా ప్రదర్శన చేయలేదు. కానీ దేశవాళీలో అతడు రాణించడం చూసిన కేకేఆర్.. 2018 వేలంలో రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. రింకూ సింగ్ తండ్రి, అన్నలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇంటింటికీ సరఫరా చేస్తుంటారు. ఇద్దరూ ఆటో డ్రైవర్లుగా పనిచేసేవారే. 9వ తరగతి వరకు చదువుకున్న రింకూకు స్వీపర్ గా జాబ్ వచ్చినా అతడు క్రికెట్ తన కెరీర్ అనుకున్నాడు. గత సీజన్ లో మెరుపులు మెరిపించిన రింకూ.. ఇప్పుడు గుజరాత్ తో మ్యాచ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ తో తనెంత విలువైన ఆటగాడో చెప్పకనే చెప్పాడు.