- Home
- Sports
- Cricket
- శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందే అఫ్గాన్‌కు భారీ షాక్.. స్పిన్ మాంత్రికుడు లేకుండానే బరిలోకి..
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందే అఫ్గాన్‌కు భారీ షాక్.. స్పిన్ మాంత్రికుడు లేకుండానే బరిలోకి..
లంకతో అఫ్గాన్.. మూడు వన్డేలు ఆడేందుకు గాను ఆ దేశానికి వెళ్లింది. జూన్ 2, 4, 7 తేదీలలో శ్రీలంక - అఫ్గానిస్తాన్ మధ్య మూడు వన్డేలు జరుగనున్నాయి.

ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో తమ ఆటగాళ్లు అందుబాటులోకి రావడంతో పలు దేశాలు వారిని ఇప్పటికే నిర్ణయించిన ద్వైపాక్షకి సిరీస్ లకు పంపిస్తున్నాయి. రెండు నెలల పాటు ఐపీఎల్ లో ఆడిన తమ జట్టు కీలక ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అఫ్గానిస్తాన్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది.
లంకతో అఫ్గాన్.. మూడు వన్డేలు ఆడేందుకు గాను ఆ దేశానికి వెళ్లింది. శ్రీలంక లోని హంబనటోట వేదికగా జూన్ 2 నుంచి ఏడు వరకూ అఫ్గాన్ క్రికెట్ జట్టు మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు ముందే అఫ్గాన్ జట్టుకు షాక్ తాకింది.
ఆ జట్టు కీలక ఆటగాడు, స్పిన్ ఆల్ రౌండర్ అయిన రషీద్ ఖాన్ లేకుండానే అఫ్గాన్ బరిలోకి దిగనుంది. వెన్నునొప్పి కారణంగా రషీద్ ఖాన్.. లంకతో జరిగే తొలి రెండు వన్డేలకు దూరంగా ఉంటాడు. మూడో వన్డే వరకు నొప్పి తగ్గితే అతడు ఆడే అవకాశం ఉంటుంది. జూన్ 2, 4, 7 తేదీలలో శ్రీలంక - అఫ్గానిస్తాన్ మధ్య మూడు వన్డేలు జరుగనున్నాయి.
కాగా ఈ సిరీస్ ముగిసిన వారం రోజుల తర్వాత అఫ్గాన్ జట్టు.. బంగ్లాదేశ్ తో చిత్తోగ్రమ్ వేదికగా ఏకైక టెస్టులో పాల్గొనాల్సి ఉంది. ఈ టెస్టులో రషీద్ ఖాన్ ఆడటం అఫ్గాన్ కు అత్యంత కీలకం. ఐపీఎల్ లో రెండు నెలల పాటు బిజీబిజీగా గడిపిన రషీద్ కు వెన్నునొప్పితో విశ్రాంతి కూడా ఇచ్చినట్టు ఉంటుందని అఫ్గాన్ క్రికెట్ జట్టు భావిస్తోంది.
లంకతో సిరీస్ కు రషీద్ గైర్హాజరీ నేపథ్యంలో మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లు అఫ్గాన్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. ఈ జట్టును హష్మతుల్లా షాహిది నడిపించనున్నాడు.
ఇక ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్ ఖాన్.. ఈ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. రషీద్.. 17 మ్యాచ్ లలో 27 వికెట్లు పడగొట్టాడు. బంతితోనే గాక బ్యాటింగ్, ఫీల్డింగ్ లలో కూడా రషీద్ ఖాన్ గుజరాత్ విజయాలలో కీలకపాత్ర పోషించాడు.