‘విరాట్ భాయ్... నేను ఫామ్‌లోకి వచ్చేశా...’ పృథ్వీషా రికార్డు డబుల్ సెంచరీ...
ఆసీస్ టూర్‌లో మొదటి టెస్టులో విఫలమై, జట్టుకు దూరమైన యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా... ఫామ్‌లోకి వచ్చినట్టు ఘనంగా చాటాడు. విజయ్ హాజారే ట్రోఫీలో అదరగొట్టే ఆటతీరుతో రికార్డుల మోత మోగిస్తున్నాడు పృథ్వీషా. శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీతో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించిన పృథ్వీషా, పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీ బాదాడు...
టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న పుదుచ్చేరి, ముంబై జట్టుకి బ్యాటింగ్ అప్పగించింది. యశస్వి జైస్వాల్ 10 పరుగులుకే అవుట్ అయినా వికెట్ కీపర్ ఆదిత్య తారేతో కలిసి రెండో వికెట్‌కి 153 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు పృథ్వీషా.
తారే 64 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేసి, అవుట్ అయ్యాడు...ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బౌండరీల మోత మోగించాడు. 58 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 133 పరుగులు చేశాడు.
టీ20 జట్టుకు సెలక్ట్ అయిన తర్వాత 229 స్ట్రైయిక్ రేటుతో సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు సూర్యకుమార్ యాదవ్...
ఆల్‌రౌండర్ శివమ్ దూబే 7 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కి 201 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు పృథ్వీషా...
మొత్తంగా 152 బంతులు ఎదుర్కొన్న పృథ్వీషా 31 ఫోర్లు, 5 సిక్సర్లతో 227 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు... పృథ్వీషా సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 457 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై...
లిస్టు ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు పృథ్వీషా. ఇంతకుముందు ఈస్ట్ లండన్ ఆటగాడు గ్రేమ్ పోలాక్ చేసిన 222 పరుగులే అత్యధికం. 227 పరుగులు చేసిన పృథ్వీషా, వీరేంద్ర సెహ్వాగ్ 219, రోహిత్ శర్మ 208 పరుగుల రికార్డులను కూడా చెరిపేశాడు...
విజయ్ హాజరే ట్రోఫీలో పృథ్వీషా చేసిన 227 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంతకుముందు 2019లో సంజూ శాంసన్ 212 పరుగులు చేశాడు...
లిస్టు ఏ క్రికెట్‌లో ముంబై చేసిన 457 పరుగులు రెండో అత్యధిక స్కోరు. ఇంతకుముందు లిస్టర్‌షేర్‌పై ఇండియా ఏ జట్టు 2018లో 458/4 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా పృథ్వీషా సెంచరీ బాదడం విశేషం.
విజయ్ హాజారే ట్రోఫీ 2021లో పృథ్వీషాకి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా సెంచరీ చేశాడు పృథ్వీషా.