అప్పట్నుంచే నన్ను తొక్కేశారు.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడిపై రాయుడు షాకింగ్ కామెంట్స్
Ambati Rayudu: ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుని రాజకీయాల వైపునకు అడుగుపెడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్- 16 ముగిసిన తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు.. తన కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాకపోవడానికి ఇక్కడ ఉన్న రాజకీయాలే కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ తనను తొక్కేయాలని చూశాడని వాపోయాడు.
క్రికెటర్ గా తన కెరీర్ ను ముగించిన తర్వాత ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు మాట్లాడుతూ.. ‘నేను హైదరాబాద్ క్రికెట్ అసోసేయేషన్ (హెచ్‌సీఏ) లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పట్నుంచే నన్ను తొక్కేసేందుకు రాజకీయ కుట్రలు మొదలయ్యాయి.
శివలాల్ యాదవ్ కొడుకు అర్జున్ యాదవ్ కు నేను పోటీగా ఉన్నానని నా కెరీర్ ను నాశనం చేశారు. అతడి కంటే నేను బాగా ఆడుతున్నప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో తనను టీమిండియాలోకి రప్పించేందుకు నన్ను మానసికంగా హింసించారు. అప్పటికీ నాకు 17 ఏండ్లే. 2003-04 సమయంలో నేను భాగా ఆడాను.
కానీ అదే సమయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీలో మార్పులు జరిగాయి. శివలాల్ యాదవ్ క్లోజ్ ఫ్రెండ్స్ సెలక్షన్ కమిటీలోకి వచ్చారు. వాళ్లు నాతో మాట్లాడకుండా చేయడంలో శివలాల్ యాదవ్ సఫలీకృతమయ్యారు. ఇక ఒకరోజైతే శివలాల్ యాదవ్ వాళ్ల సోదరుడైతే మా ఇంటి ముందుకు బాగా తాగొచ్చి గొడవ చేశాడు. నా కుటుంబాన్ని బండబూతులు తిట్టాడు..’అని వాపోయాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత పరిస్థితిపై రాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు హెచ్‌సీఏ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందని దానిని ఎవరూ బాగు చేయలేరని రాయుడు చెప్పాడు. ‘హైదరాబాద్ క్రికెట్ కు నేను చిన్నప్పట్నుంచే క్యాన్సర్ పట్టుకుంది. ఇప్పుడు అది ఫోర్త్ స్టేజ్ కు చేరుకుంది.
హెచ్‌సీఎను ఇప్పుడు ఎవరూ బాగుచేయలేరు. బీసీసీఐ ఏమైనా జోక్యం చేసుకుని దానిని బాగు చేస్తే తప్ప దాని పరిస్థితి దారుణంగా ఉంది’అని చెప్పుకొచ్చాడు. రాయుడు ఇటీవలే ముగిసిన ఐపీఎల్ - 16 తర్వాత రిటైర్ అయ్యాడు. త్వరలోనే అతడు ఆంధ్ర రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.