సుప్రీం చెప్పింది.. దాదాను ఎలా తొలగిస్తారు? గంగూలీ ఉద్వాసనపై కలకత్తా హైకోర్టులో పిల్
BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఆ పదవి నుంచి తప్పించడాన్ని తప్పుబడుతూ ఇదివరకే బెంగాల్ లో రాజకీయ రగడ నడిచింది. తాజాగా ఈ వివాదం కోర్టుకెక్కింది.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కలకత్తా కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. గంగూలీ కొనసాగవచ్చునని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పినా దాదాను తొలగించడం దారుణమని ఆరోపిస్తూ.. కలకత్తా చెందిన ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశాడు.
రమాప్రసాద్ సర్కార్ అనే న్యాయవాది కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ.. ‘సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం బీసీసీఐలో అప్పటి అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షా మరో దఫా కొనసాగవచ్చునని తీర్పునిచ్చింది. అయితే జై షా తిరిగి తన పదవిని దక్కించుకున్నాడు. కానీ గంగూలీని మాత్రం బీసీసీఐ నుంచి పంపించారు..’ అని తన పిల్ లో పేర్కొన్నాడు.
దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం పాతవారినే కొనసాగిస్తే గంగూలీ 2025 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండేవాడు. కానీ అలా జరుగలేదు. దాదాను బీసీసీఐ నుంచి పంపించాలనే తలంపుతో ఉన్న పలువురు పెద్దలు.. గంగూలీని తప్పించి ఆ స్థానంలో రోజర్ బిన్నీని తీసుకొచ్చారు.
ఇది రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపింది. తమ మాట వినకుంటే బీజేపీ.. ఏమైనా చేస్తుందనడానికి ఇదే నిదర్శనమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణులు డిమాండ్ చేశాయి. దాదాకు అన్యాయం జరిగిందని బెంగాల్ లో నిరసనలు కూడా చేపట్టాయి.
ఇదే విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. దాదాకు అన్యాయం జరిగిందని.. అతడు ఒక్క బెంగాల్ లోనే గాక దేశమంతటా ప్రముఖ వ్యక్తి అని.. అటువంటి దాదాకు అన్యాయం చేయడం సరైంది కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాను ఐసీసీకి పంపిస్తే దాదాకు న్యాయం చేసినట్టు అవుతుందని ప్రధాని మోడీని సైతం కోరారు.
ఇదిలాఉండగా బీసీసీఐ నుంచి తప్పుకున్నాక గంగూలీ బెంగాల్ అసోసియన్ (క్యాబ్) ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ దాదా తన అన్న స్నేహశీశ్ గంగూలీ కోసం తన మనసు మార్చుకున్నాడు. ఐసీసీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్న దాదా త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించనున్నాడు.