- Home
- Sports
- Cricket
- IPL: నీ పని అయిపోయిందన్నారు.. వాళ్లకు నీ విలువేంటో చెప్పావ్.. తమ్ముడిపై అన్న కృనాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
IPL: నీ పని అయిపోయిందన్నారు.. వాళ్లకు నీ విలువేంటో చెప్పావ్.. తమ్ముడిపై అన్న కృనాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
IPL 2022- Hardik Pandya: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 ఫైనల్ లో రాజస్తాన్ రాయల్స్ పై గెలిచి చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా పై అన్న కృనాల్ పాండ్యా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్-15 సీజన్ కు ముందు వరుస గాయాలతో పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. తనపై వచ్చిన విమర్శలకు ట్రోఫీ నెగ్గి సమాధానమిచ్చాడు. తాను జీరో కాదని.. అవకాశమిస్తే టీమిండియాకు కూడా సారథ్యం వహించగలిగే సత్తా ఉందని నిరూపించాడు.
తమ్ముడు హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కు తొలి ట్రోఫీ అందించడంపై అతడి అన్న కృనాల్ పాండ్యా స్పందించాడు. గుజరాత్ టైటిల్ నెగ్గిన రెండ్రోజుల తర్వాత కృనాల్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘మై బ్రో.. నీ విజయం వెనుక దాగి ఉన్న హార్డ్ వర్క్ ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఎన్నో ఉదయాలు, గంటల పాటు ట్రైనింగ్, క్రమశిక్షణ, మానసికంగా దృఢత్వం.. ఇవన్నీ నీ విజయానికి సోపానాలు.. ఇప్పుడు నువ్వు ట్రోఫీని ఎత్తుతుంటే అదంతా నీ కష్టానికి దొరికిన ప్రతిఫలంగా అనిపిస్తున్నది. నువ్వు ఈ విజయానికి వంద శాతం అర్హుడవు.
చాలా మంది నీ పని అయిపోయిందని.. నువ్వు ఆటకు పనికిరావని అన్నారు. కానీ నువ్వు వారిని తప్పని ప్రూవ్ చేశావ్.. నీ పేరును లక్షలాది మంది ప్రజలు జపిస్తుండగా నేను అక్కడ ఉన్నాను. నీ విజయాన్ని కళ్లారా చూశాను..’ అని భావోద్వేగ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ లో సుమారు ఐదేండ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన హార్ధిక్ పాండ్యా-కృనాల్ పాండ్యా లు ఈ సీజన్ లో మాత్రం రెండు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఆడారు. హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించగా.. కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున స్పిన్ తో పాటు ఆల్ రౌండర్ గా కూడా సేవలందించాడు.
ఈ సీజన్ కు ముందు గాయాల బారీన పడ్డ హార్ధిక్.. గతేడాది టీ20 ప్రపంచకప్ లో పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. తర్వాత ఐపీఎల్ లో ఆరేండ్ల పాటు ఉన్న ముంబై ఇండియన్స్ కూడా అతడిని ఈ సీజన్ కోసం రిటైన్ చేసుకోలేదు.
దీంతో హార్ధిక్ కెరీర్ ముగిసినట్టే అని అనుకున్నారంతా. కానీ పాండ్యా మాత్రం గోడకు కొట్టిన బంతిలా రివ్వులా పైకి ఎగిరి తనపై వస్తున్న విమర్శలకు తన ఆటతోనే సమాధానమిచ్చాడు.
ఈ సీజన్ లో బ్యాట్ తో పాటు బంతితో కూడా రాణించి తనలో ఆల్ రౌండర్ ఇంకా అలాగే ఉన్నాడని నిరూపించాడు. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్ తో ముగిసిన ఫైనల్స్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో 34 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్ లో 14 ఇన్నింగ్స్ లలో 487 పరుగులు కూడా చేసి గుజరాత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.