Champions Trophy 2025: పాకిస్తాన్ పై వర్షం దెబ్బ.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ రద్దు
Champions Trophy 2025: భారీ వర్షం కారణంగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ రద్దు అయింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి ఔట్ అయింది.

Team Pakistan (Photo: ICC)
Pakistan vs Bangladesh: పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌కు ఐసీసీ టోర్నమెంట్‌ను నిర్వహించే అవకాశం లభించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ కు చేదు అనుభవమే ఎదురైంది. ఎందుకంటే ఈ మెగా ఈవెంట్ లో ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవకుండానే టోర్నమెంట్ నుంచి ఔట్ అయింది. తమకు మిగిలిన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ లో గెలిచి పరువు నిలుపుకుందామనుకుంది. కానీ, ఆ మ్యాచ్ కూడా వర్షం దెబ్బకు పోయిది. భారీ వర్షం కారణంగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ గ్రూప్ మ్యాచ్ రద్దు అయింది. దీంతో చెరో ఒక పాయింట్ తో టోర్నీ నుంచి ఇరు జట్లు బయటకు వచ్చాయి.
వరుసగా న్యూజిలాండ్, భారత్ లతో ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయి సెమీస్ అవకాశాలను కోల్పోయిన పాకిస్తాన్.. చివరి మ్యాచ్‌లో విజయంతో వీడ్కోలు పలకాలని చూసింది. కానీ, ఆ ఆశ కూడా అడియాసలైంది. బంగ్లాదేశ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో వర్షం పాకిస్తాన్‌కు విలన్‌గా మారడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు అయింది. పాకిస్తాన్ తమ మూడు మ్యాచ్ లలో రెండు ఓడిపోగా, ఒకటి వర్షంతో రద్దు అయింది.
రావల్పిండిలో జరగాల్సిన పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. వర్షం తగ్గకుండా కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్ రద్దు నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉన్నప్పటికీ వారి స్వదేశంలో ఒకే ఒక మ్యాచ్ ఆడగలిగింది. రెండో మ్యాచ్ భారత్ తో దుబాయ్ లో ఆడింది. మూడో మ్యాచ్ టాస్ పడకుండానే రద్దు అయింది.
ఐసీసీ టోర్నమెంట్.. ఒక్క గెలుపు లేదు.. పాక్ ఇజ్జత్ పాయే
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. తన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ కరాచీలో న్యూజిలాండ్‌తో తలపడింది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీని తర్వాత తన రెండో మ్యాచ్ ను భారత్ ఆడింది. ఈ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ భారత్ చేతిలో చిత్తుగా ఓడింది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత, పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్స్‌కు దూరమైంది. న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం చివరి ఆశగా ఉంది, కానీ ఈ పాక్ అనుకున్నది జరగలేదు. దీంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండూ సెమీస్ రేసు నుంచి ఔట్ అయ్యాయి.
ఇక ఈ రెండు జట్లు గ్రూప్ దశలో విజయంతో టోర్నీ నుంచి బయటకు రావాలని చూశాయి. అయితే, రావల్పిండిలో భారీ వర్షం కారణంగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు అయింది. విజయంతో వీడ్కోలు పలకాలనే పాకిస్తాన్ కల కూడా చెదిరిపోయింది.