- Home
- Sports
- Cricket
- కోహ్లి రికార్డును బద్దలుకొట్టిన పాకిస్తాన్ కెప్టెన్.. విరాట్ కు సాధ్యం కాని ఘనతలూ సొంతం..
కోహ్లి రికార్డును బద్దలుకొట్టిన పాకిస్తాన్ కెప్టెన్.. విరాట్ కు సాధ్యం కాని ఘనతలూ సొంతం..
Babar Azam vs Virat Kohli: టీమిండియా వెటరన్ ఆటగాడు మాజీ సారథి విరాట్ కోహ్లి రికార్డును పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ బద్దలుకొట్టాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో బాబర్ ఈ రికార్డును అందుకున్నాడు.

పాకిస్తాన్ కు మూడు ఫార్మాట్లలో సారథిగా వ్యవహరిస్తున్న బాబర్ ఆజమ్.. స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు.
కెప్టెన్ గా అతి తక్కువ ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది.
వన్డేలలో కెప్టెన్ గా ఉండి 17 ఇన్నింగ్స్ లలోనే కోహ్లి వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. తాజాగా బాబర్.. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ కేవలం 13 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి రన్స్ కొట్టడం విశేషం.
అదీగాక తాజాగా విండీస్ మీద చేసిన సెంచరీతో అతడు డబుల్ హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఆటగాడు బాబర్ ఒక్కడే.
బాబర్ కు ఇది వన్డేలలో 17వ సెంచరీ. 86 మ్యాచులలోనే అతడు ఈ ఘనత సాధించాడు. కోహ్లి 260 వన్డేలలో 43 సెంచరీలు చేశాడు. వన్డేలలో కోహ్లి సగటు 58.07 కాగా.. బాబర్ ది 59.78 గా ఉంది.
గడించిన ఐదు వన్డే ఇన్నింగ్స్ లలో బాబర్ చేసిన స్కోర్లివి.. 158, 57, 114, 105 నాటౌట్, 103. ఇదిలాఉండగా ముల్తాన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది పాక్.
ఈ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. షాయ్ హోప్ (127) సెంచరీతో కదం తొక్కగా.. బ్రూక్స్ (70), పావెల్ (32) లు రాణించారు.
అనంతరం పాకిస్తాన్.. 49.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ముద్దాడింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (103) తో పాటు ఇమామ్ ఉల్ హక్ (65), మహ్మద్ రిజ్వాన్ (59), ఖుష్దిల్ షా (41 నాటౌట్)లు మెరుగ్గా ఆడి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.