హార్ధిక్ వంటి ఆల్ రౌండర్ పాకిస్తాన్‌కు లేడు : పాండ్యాపై షాహిద్ అఫ్రిది ప్రశంసలు
Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. కొంతకాలం విరామం తర్వాత జూన్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన సిరీస్ నుంచి జట్టులోకి వచ్చిన హార్ధిక్.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
టీ20లలో మ్యాచ్ ను పూర్తి చేసే ఫినిషర్లు కీలక పాత్ర పోషిస్తారు. మరీ ముఖ్యంగా ఆ ఫినిషర్లు ఆల్ రౌండర్లు అయితే అది ఆ జట్టుకు వరమే. అలాంటి ఆల్ రౌండర్ టీమిండియాకు ఉన్నాడని పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. అటువంటి ఆల్ రౌండర్ పాక్ కు లేడని కుండబద్దలు కొట్టాడు.
పాకిస్తాన్ కు చెందిన సామా టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఫ్రిదికి యాంకర్ ఓ ప్రశ్న వేశాడు. ‘మనకు హార్ధిక్ పాండ్యా వంటి ప్లేయర్ కావాలి. బ్యాటింగ్ లో నమ్మకంగా ఆడుతూ బౌలింగ్ లో రాణిస్తూ చివరికి మ్యాచ్ లను ఫినిష్ చేయడంలో కీలక పాత్ర పోషించాలి. పాకిస్తాన్ జట్టులో అటువంటి ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా..?’ అని ప్రశ్న వేశాడు.
ఈ ప్రశ్నకు అఫ్రిది సమాధానం చెబుతూ.. ‘అవును. మీరు చెప్పింది వంద శాతం నిజం. మనకు అటువంటి (హార్ధిక్ పాండ్యా) ఫినిషర్ లేడు. అసిఫ్ అలీ, ఖుష్దిల్ షా లు ఆ పాత్ర పోషించాలని పాకిస్తాన్ కోరుకుంటున్నది. కానీ వాళ్లలో నిలకడ లోపించింది. పదే పదే విఫలమవుతున్నారు.
మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ లు కూడా ఫినిషర్ పాత్ర పోషిస్తారనుకుంటే వాళ్లదీ అదే పరిస్థితి. అందుకే పాకిస్తాన్ మిడిలార్డర్ లో ఒకరిద్దరు ఔట్ కాగానే మిగిలిన బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు..’ అని అన్నాడు.
ఒకప్పుడు పాకిస్తాన్ లో అబ్దుల్ రజాక్, షాహిద్ అఫ్రిది వంటి నాణ్యమైన ఆల్ రౌండర్లు ఉండేవాళ్లు. వీళ్లు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించేవాళ్లు. కానీ వీరి రిటైర్మెంట్ తర్వాత పాకిస్తాన్ ఆ స్థాయి ఆల్ రౌండర్లను తయారుచేయలేకపోతున్నది. మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ లు ఎప్పుడో ఒకప్పుడు మెరుపులు మెరిపిస్తున్నారే తప్ప నిలకడ లేదు.
ఇక హార్ధిక్ పాండ్యా విషయానికొస్తే వెన్నునొప్పి గాయం తర్వాత జట్టులోకి వచ్చిన అతడు గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఆడినా విఫలమయ్యాడు. జట్టులో చోటు కోల్పోయినా ఆరు నెలలు విరామం తీసుకుని ఐపీఎల్ లో అసాధారణ ప్రదర్శనలు చేసి మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో బౌలింగ్ లో మూడు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్ లో కూడా కీలక పాత్ర పోషించాడు. 17 బంతుల్లోనే 33 పరుగులు చేసి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా హార్ధిక్ నిలకడగా రాణించాడు.