తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమనుకుంటా... మరోసారి షాహిదీ ఆఫ్రిదీ షాకింగ్ కామెంట్లు...
నోరు ఉంది కదా, ఏది పడితే అది వాగుతుండడం కొందరు పాకిస్తానీ క్రికెటర్లకు బాగా అలవాటే. అందులో మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ ముందు వరుసగా ఉంటాడు. మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు ఆఫ్రిదీ...
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కొన్ని లీగుల్లో కొనసాగుతున్న షాహిదీ ఆఫ్రిదీ... తాలిబన్ల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి...
‘తాలిబన్లు ఓ మంచి పాజిటివ్ మైండ్‌తో వచ్చారు. వాళ్లు ఆడవాళ్లను పని చేసుకోనిస్తున్నారు. క్రికెట్‌కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్లకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు షాహిదీ ఆఫ్రిదీ...
తాలిబన్ల కారణంగా ఆఫ్ఘాన్ ప్రజలు అష్టకష్టాలు పడుతూ, క్షణక్షణం ప్రాణభయంతో బతుకుతుంటే... వారి గురించి ఆఫ్రిదీ పాజిటివ్ కామెంట్లు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది...
ఆఫ్ఘాన్‌లో తాలిబన్లు ఈ స్థాయిలో చెలరేగిపోవడానికి పాకిస్తాన్ కారణమైందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో షాహిదీ ఆఫ్రిదీ చేసిన కామెంట్లు... ఆ ఆరోపణలకు మరింత ఊతానిస్తున్నాయి..
గత నెల రోజులుగా ఆఫ్ఘాన్‌లో జరుగుతున్న సంఘటనలు, యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాణభయంతో వేలమంది ప్రజలు, ఆఫ్ఘాన్ వదిలి వలసెల్లిపోయారు...
మరికొందరు ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. కాబూల్ ఎయిర్‌పోర్టులో బాంబు దాడి జరగగా, తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టం చేశారు... ఆఫ్ఘాన్‌లో జరుగుతున్న హృదయ విదారక దృశ్యాలతో ప్రపంచదేశాల ప్రజలు, వారి కోసం ప్రార్థిస్తుంటే... తాలిబన్ల గురించి పాజిటివ్ కామెంట్లు చేసి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఆఫ్రిదీ...