- Home
- Sports
- Cricket
- అయినా ఆశ చావలేదు.. ఆతని కోరిక తీరలేదు.. క్యాబ్ ఎన్నికల్లో పోటీ పడతానంటున్న దాదా.. పెద్ద స్కెచ్చే వేశాడుగా..!
అయినా ఆశ చావలేదు.. ఆతని కోరిక తీరలేదు.. క్యాబ్ ఎన్నికల్లో పోటీ పడతానంటున్న దాదా.. పెద్ద స్కెచ్చే వేశాడుగా..!
BCCI Elections: కిందిస్థాయి పోస్టు నుంచి క్రమంగా ఎదిగి ఒకసారి ఉన్నత పదవులు అధిరోహించిన తర్వాత ఎవరైనా మళ్లీ కిందికి వెళ్లమంటే అందుకు ససేమిరా అంటారు. కానీ దాదా మాత్రం తాను వెళ్తా అంటున్నాడు.

రాజకీయాలలో ఎదగడం రెండు రకాలు. ఒకటి జనాల ఆదరణతో క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానాలకు వెళ్లడం. రెండో రకం వాళ్లైతే తమకు అడ్డొచ్చిన వారిని నయానో భయానో లొంగదీసుకుని తాము అనుకున్న స్థానానికి చేరడం. ప్రస్తుతం రెండో రకం రాజకీయ నాయకులే ఎక్కువ.
అయితే పై రెండు రకాల నాయకుల్లో ఒక ఉన్నత పదవిని అధిరోహించి కొన్నాళ్లు ‘ఆ రాజభోగాలు’ అనుభవించిన తర్వాత మళ్లీ కిందికి చూడమంటే చూడరు. అక్కడ ఉన్నా ఓకే లేదంటే ఇంకా పై స్థానాలకు వెళ్లాలనుకుంటారే తప్ప అంతకంటే కిందికి చూడరు. కానీ తాను మాత్రం చూస్తానంటున్నాడు బీసీసీఐ రాజకీయాలకు బలైన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.
బీసీసీఐకి రెండోసారి అధ్యక్షుడిని కావాలని చూసిన దాదాకు ‘బోర్డు పెద్దలు’ ఆ అవకాశమివ్వలేదు. దాదాను సాగనంపుతూ అతడి స్థానంలో రోజర్ బిన్నీని తీసుకొస్తున్నారు. బీసీసీఐ పోతే పోయింది తనకు ఐసీసీ లో భారత ప్రతినిధిగా అయినా అవకాశమివ్వండి అన్నా బోర్డు పెద్దలు అందుకు కూడా ఒప్పుకోలేదు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన దాదా.. ఎవర్నో అడిగేదేంటి..? తనకూ ‘రాజకీయాలు’ తెలుసునని మళ్లీ ఒకటి నుంచి మొదలుపెడుతున్నాడు. త్వరలో జరుగబోయే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ఎన్నికలలో పోటీ పడనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
‘అవును. నేను క్యాబ్ ఎన్నికలలో పోటీ పడుతున్నా. ఈ నెల 20న నా ప్యానెల్ ను ప్రకటిస్తా. 22న నామినేషన్ దాఖలు చేస్తా.. లోధా కమిటీ సూచనల మేరకు నేను క్యాబ్ అధ్యక్షుడిగా మరో నాలుగేండ్లు ఈ పదవవిలో ఉండే అవకాశముంటుంది కదా..’ అని దాదా తెలిపాడు.
గతంలో దాదా 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. 2019లో చివరినిమిషంలో బీసీసీఐ అధ్యక్ష రేసులో నిలిచాడు. బ్రిజేష్ పటేల్ కు ఆ అవకాశమొస్తుందని అందరూ భావించినా ఆఖరి క్షణంలో దాదా పేరు తెరమీదకు రావడం అతడు బీసీసీఐ బాస్ కావడం జరిగిపోయాయి.
అయితే ఇప్పుడు దాదా చేస్తున్న ప్రయత్నాలు బీసీసీఐ అగ్రపీఠం కోసమైతే కాదు. కానీ ఐసీసీకి వెళ్లాలన్న గంగూలీ ఆశలు మాత్రం చావలేదు. బీసీసీఐ లో అవకాశం దక్కకున్నా ఐసీసీకి వెళ్లేందుకు దాదా రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నాడని.. అందుకే క్యాబ్ అధ్యక్షుడిగా మళ్లీ పోటీ చేయనున్నాడని తెలుస్తున్నది. ఐసీసీ అధ్యక్ష పదవి కోసం కూడా ఈనెల 20 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకాబోతున్నది.
దాదా కూడా ఆ తర్వాత రెండ్రోజులకే క్యాబ్ ఎన్నికలలో పోటీ పడేందుకు నామినేషన్ వేస్తానని ప్రకటించాడు. మరి బీసీసీఐ పెద్దలు మనసు మార్చుకుని దాదాను ఐసీసీకి పంపిస్తారా..? లేక కోల్కతాలో కూడా గెలవకుండా చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది.
ఇదిలాఉండగా ఇటీవల బీసీసీఐ మీటింగ్ లో తనకు ఐపీఎల్ అధ్యక్ష పదవి ఇవ్వజూపగా దాదా అందుకు అంగీకరించలేదని, తన స్థాయికి అది తగదని తనవాళ్లతో వ్యాఖ్యానించాడని వార్తలు వచ్చాయి. మరి ఐపీఎల్ చైర్మెన్ తో పోల్చితే క్యాబ్ అధ్యక్ష పదవి అనేది అసలు విషయమే కాదు. మరి ఇంత చిన్న పోస్టుకు దాదా ఎందుకు పోటీ పడుతున్నాడనేది ఆసక్తికరం.