Hardik Pandya: అదే లేకుంటే ఇప్పటికి ఏ పెట్రోల్ బంకులోనో పనిచేసుకుంటూ ఉండేవాడిని.. పాండ్యా సంచలన కామెంట్స్
Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత క్రికెట్ లోకి అడుగుపెట్టకముందు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన హార్ధిక్.. తన అద్భుత ఆటతీరుతో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు.
టీమిండియా (Team India) ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (Hardik pandya) లైఫ్ స్టైల్ అందరికీ తెలిసిందే. ష్యాషన్ ఐకాన్ గా ఉన్న ఈ బరోడా బాంబర్.. స్టార్ కాకముందు చాలా కష్టాలు పడ్డాడు. పేద కుటుంబానికి చెందిన పాండ్యా సోదరులు.. ఐపీఎల్ (IPL)లో మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టులో చోటు సంపాదించారు.
సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు డబ్బు కీలకమే. ఇక ప్రతి ఆటగాడి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందనేది బహిరంగ రహస్యమే. ఒకప్పుడు క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని స్థితి నుంచి ఇప్పుడు అత్యంత విలాసవంతమైన లైఫ్ అనుభవిస్తున్న హార్ధిక్ పాండ్యా.. డబ్బుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఒకప్పుడు రోజంతా ఆహారం కోసం 5 రూపాయలు ఖర్చు చేసి మ్యాగీ కొనుక్కుని తిన్న రోజులను పాండ్యా గుర్తు చేసుకున్నాడు. డబ్బు కారణంగా ఆటగాళ్లు జీవితంలో వృత్తిగతంగా ముందుకు వెళ్లేందుకు, ప్రేరణ పొందేందుకు దోహదం చేస్తుందని పాండ్యా అన్నాడు. డబ్బు వల్ల జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పాడు.
ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన పాండ్యాకు అక్కడున్న వ్యక్తి ‘ఐపీఎల్ వేలంలో భారీమొత్తంలో ఆఫర్ దక్కించుకునే ఆటగాళ్లు తాము ఆ ధరకు అమ్ముడుపోయేందుకు అర్హులమనే అనుకుంటారు కదా..? ఇలాంటివి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయవా..? ఆలోచనలను పక్కదారి పట్టిస్తాయి కదా..?’ అని ప్రశ్నించాడు.
దానికి హర్ధిక్ సమాధానం చెబుతూ.. ‘అసలేం జరుగుతుందో అర్థం చేసుకునే శక్తి మనకుండాలి. నేను, కృనాల్ అంకితభావం కలిగిన ఆటగాళ్లం. ఐపీఎల్ లో కచ్చితంగా డబ్బు దొరుకుతుందనే విషయం మాకు తెలుసు. అయితే డబ్బు వచ్చినంత మాత్రానా ఆలోచనలు మారకూడదు. డబ్బు మంచిది సోదరా.. మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తుంది.. అందుకు నా జీవితమే గొప్ప ఉదాహరణ’ అని అన్నాడు.
ఇందుకు గల కారణాలను పాండ్యా వివరిస్తూ.. ‘నాకు ఇలాంటి అవకాశాలే దొరక్కపోయి ఉంటే ఇప్పటికి నేను ఏ పెట్రోల్ పంప్ లోనో పనిచేస్తూ ఉండేవాడిని. నేనేమీ జోక్ గా ఈ మాట చెప్పడం లేదు. నాకు సంబంధించినంతవరకు కుటుంబమే నా తొలి ప్రాధాన్యత. నా కుటుంబానికి మంచి జీవితం ఇవ్వడానికి నేను ఇలాంటి పనులు చేయడానికి వెనుకాడను’ అని కుండబద్దలు కొట్టాడు.
ఆటతో పాటు డబ్బు కూడా ఆటగాడికి ముఖ్యమేనని పాండ్యా అన్నాడు. ఒకవేళ డబ్బు దొరకనట్లయితే.. ఎంతమంది క్రికెట్ ఆడతారో తనకైతే తెలియదని తెలిపాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హార్ధిక్ పాండ్యాకు ఆ జట్టు ఏటా రూ. 11 కోట్లు చెల్లిస్తున్నది.
Mumbai Indians
ఇదిలాఉండగా.. యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో పాండ్యా ను ఎలా ఉపయోగించుకుంటున్నారనేదానిమీద ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే నేడు ఇంగ్లండ్ తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఆ విషయం తేలనున్నది. పాండ్యా బౌలింగ్ వేస్తాడా..? లేకుంటే స్పెషలిస్టు బ్యాట్స్మెన్ గానే ఉండిపోతాడా..? అన్నది చూడాల్సి ఉంది.