వన్డే క్రికెట్ చచ్చిపోతోంది.. దానిని బ్యాన్ చేయాలి.. వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు
Wasim Akram On ODI's: పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ వన్డే క్రికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫార్మాట్ క్షీణించేదశలో ఉందని.. దానిని రద్దు చేయడం తప్పితే మరో ఆప్షన్ లేదని వ్యాఖ్యానించాడు.

ప్రపంచ క్రికెట్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ పెను దుమారం రేపుతోంది. తీరికలేని షెడ్యూల్స్ వల్ల ఆల్ ఫార్మాట్ ఆడే ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలిసిపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో వాటిని నిజం చేస్తూ స్టోక్స్ వన్డేల నుంచి వైదొలిగాడు.
తాజాగా స్టోక్స్ నిర్ణయంపై పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ స్పందించాడు. వన్డే క్రికెట్ అంతరించిపోయే దశలో ఉందని.. దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. ఆ ఫార్మాట్ వల్ల ఆటగాళ్లు మరింత అలిసిపోతున్నారే తప్ప ఉపయోగమేమీలేదని చెప్పాడు.
ఓ క్రికెట్ పోడ్కాస్ట్ లో అక్రమ్ మాట్లాడుతూ.. ‘వన్డే క్రికెట్ ను రద్దు చేయాలి. వన్డేలు ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్ లో మీకు స్టేడియాలు నిండుతున్నాయి. కానీ మిగతా దేశాల్లో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో వన్డేలకు పెద్దగా ఆదరణ లేదు. వన్డే మ్యాచులు జరుగుతున్నప్పుడు స్టేడియంలో మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులెవరూ రావడం లేదు.
వన్డేలలో తొలి 10 ఓవర్లలో కాస్త దూకుడుగా ఆడి ఆ తర్వాత బంతికో పరుగు.. రెండు ఓవర్లకో ఫోర్.. 40 ఓవర్ల వరకు 220 పరుగులు. మళ్లీ చివరి పది ఓవర్లలో ధాటిగా ఆడటం అనే మూస సంప్రదాయంతో వన్డేలు సాగుతున్నాయి..
ఇక ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాధకలిగించింది. కానీ నేను అతడితో అంగీకరిస్తాను. ఒక ఆటగాడిగానే గాక కామెంటేటర్ గా కూడా నేను వన్డే క్రికెట్ ను రద్దు చేయమనే సూచిస్తాను. ముఖ్యంగా టీ20లు వచ్చాక వన్డే ఫార్మాట్ చచ్చిపోయింది.
వన్డే ఫార్మాట్ అంటే రెండు జట్లు 100 ఓవర్లు ఆడాలి. దానివల్ల ప్లేయర్లు చాలా అలిసిపోతున్నారు. అదీగాక మ్యాచ్ కు ముందు ప్రీ గేమ్ అని పోస్ట్ గేమ్ అని.. ఆట మధ్యలో లంచ్ అంటూ ఎంతలేదైనా రోజంతా గడిచిపోతుంది. కానీ టీ20 అలా కాదు. మహా అయితే నాలుగు గంటల్లో ఖేల్ ఖతం. ఆధునిక క్రికెట్ లో టీ20, టెస్టు మాత్రమే మనగలుగుతున్నాయి. వన్డే క్రికెట్ చచ్చిపోతున్నది..’ అని వ్యాఖ్యానించాడు.
1992 World Cup: Wasim Akram (Pakistan) — 18 wickets (10 matches)
ఆసక్తికరమైన విషమేమిటంటే తన కెరీర్ లో 104 టెస్టులలో 414 వికెట్లు తీసిన అక్రమ్.. వన్డేలలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఘనత సాధించాడు. 356 వన్డేలలో అతడు 502 వికెట్లు తీశాడు. అలాంటి అక్రమ్.. వన్డేలను రద్దు చేయాలని కోరడం ఆశ్చర్యకరం.