- Home
- Sports
- Cricket
- ఇక మా చేతుల్లో ఏం లేదు! అది వాళ్ల ఇష్టం... ఐపీఎల్ 2023పై మాట మార్చిన కెప్టెన్ రోహిత్ శర్మ...
ఇక మా చేతుల్లో ఏం లేదు! అది వాళ్ల ఇష్టం... ఐపీఎల్ 2023పై మాట మార్చిన కెప్టెన్ రోహిత్ శర్మ...
ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత 10 రోజుల గ్యాప్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతోంది టీమిండియా. ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ రూపంలో ముగ్గురు స్టార్ ప్లేయర్లు, ఫైనల్‌కి దూరమయ్యారు. ఐపీఎల్‌లో కీ ప్లేయర్లు గాయపడితే టీమిండియా పరిస్థితి ఏంటి?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కెఎస్ భరత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్... ఇలా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోయే టీమ్‌లో ఒక్క ఛతేశ్వర్ పూజారా తప్ప మిగిలిన అందరూ ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడబోతున్నారు..
Image credit: PTI
ఫైనల్ ఆడే ప్లేయర్లపై వర్క్ లోడ్ తక్కువ ఉండేలా ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో మాట్లాడతామని చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఇప్పుడు మాట మార్చాడు. తమ చేతుల్లో ఏమీ లేదని, ఇక అంతా ఫ్రాంఛైజీల చేతుల్లోనే ఉందంటూ కుండబద్ధలు కొట్టేశాడు...
‘ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కోట్లు పెట్టి కొనుగోలు చేశాయి. ఇప్పుడు ప్లేయర్లు వాళ్ల సొంతం. వాళ్లని ఆడించవద్దని చెప్పే హక్కు మాకు లేదు. అయితే టీమ్స్ అన్నింటికీ మేం కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాం... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే ప్లేయర్లపై వర్క్ లోడ్ పడకుండా చూసుకోవాల్సిందిగా కోరాం...
అయితే అది ఫ్రాంఛైజీల పైనే ఆధారపడి ఉంది. అయినా ప్లేయర్లకు వాళ్ల శరీరం గురించి బాగా తెలుసు. వాళ్లేం చిన్న పిల్లలు కాదు.. బలవంతంగా ఆడించడానికి! ఎక్కువ మ్యాచులు ఆడుతున్నాం, వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని అనిపిస్తే వాళ్లే టీమ్స్‌తో మాట్లాడి రెస్ట్ తీసుకోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
‘ప్రతీ ఆటలో గాయాలు అత్యంత సహజం. ప్లేయర్లకు కూడా గాయపడి, ఇంట్లో కూర్చోవడం అస్సలు నచ్చదు కానీ కొన్నిసార్లు తప్పదు. ఇందులో ఎవ్వరినీ తప్పు పట్టలేం. శ్రేయాస్ అయ్యర్ ఆ రోజు బ్యాటింగ్ చేయాలని అనుకున్నాడు. రోజంతా కూర్చొని ఎదురుచూశాడు కానీ కుదర్లేదు...
అందుబాటులో ఉన్న బెస్ట్ ప్లేయర్లను టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడించేందుకు ప్రయత్నిస్తాం. అందుకే టీమ్ మేనేజ్‌మెంట్ వరుసగా ప్లేయర్లకు బ్రేకులు ఇస్తోంది. మా చేతుల్లో ఉన్నది ఇదే. అదే చేస్తున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ..