ఐపీఎల్, ఆసియా కప్‌లే కాదు.. వరల్డ్ కప్‌కూ పంత్ దూరమే..? బీసీసీఐ కీలక అప్డేట్
Rishabh Pant: గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురై ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ ఇప్పట్లో మళ్లీ బ్యాట్ పట్టే సూచనలు కనిపించడం లేదు.

కొద్దిరోజుల క్రితం కారులో తన ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యం గురించి బీసీసీఐ వర్గాలు షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నాయి. గాయంతో అతడు ఐపీఎల్ - 2023, ఆసియా కప్ (సెప్టెంబర్) లలోనే కాదు ఏకంగా వన్డే వరల్డ్ కప్ (అక్టోబర్) లో కూడా ఆడేది అనుమానంగానే ఉంది.
ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్.. ఆరోగ్యం ఆశించినంత గొప్పగా ఏమీ లేదని తెలుస్తున్నది. అతడు ఎప్పుడు కోలుకుంటాడు..? తిరిగి బ్యాట్ ఎప్పుడు పడతాడు..? అనే సంగతి అటుంచితే పంత్ సాధారణ స్థితికి రావడానికే సుమారు ఆరు నుంచ 8 నెలల సమయం పట్టొచ్చని సమాచారం. ఆ తర్వాతే అతడి ఆట, ఫిట్నెస్ గురించి ఆలోచించడానికి ఓ నిర్ణయానికి రావచ్చు.
కోకిలాబెన్, బీసీసీఐ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం.. పంత్ కుడి మోకాలిలో మూడు లెగ్మెంట్ లు బాగా దెబ్బతిన్నాయని, వాటిలో రెండింటిని ఇటీవలే శస్త్రచికిత్స ద్వారా సరిదిద్దారని తెలుస్తున్నది. మరో ఆరు వారాల్లో పంత్ కు మరో కీలక సర్జరీ జరగాల్సి ఉంది. ఈ ఆపరేషన్ అయితే గానీ అసలు పంత్ ఆరోగ్యం గురించి ఓ నిర్ధారణకు రాలేని పరిస్థితి నెలకొంది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘వైద్యుల పర్యవేక్షణలో పంత్ కు చికిత్స అందుతున్నది. వైద్యులు చెబుతున్నదాని ప్రకారం.. అతడు సాధారణ స్థితికి రావడానికే సుమారు ఆరు నుంచి 8 నెలలు పట్టే అవకాశముంది. అయితే అతడు తిరిగి జట్టుతో ఎప్పుడు కలుస్తాడనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.
ఎంతలేదన్న పంత్ కనీసం 8 నుంచి 9 నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సిందే. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మొత్తంగా ఈ ఏడాది మొత్తం పంత్ తిరిగి గ్రౌండ్ లోకి రావడం అనుమానమే. అయితే తర్వాత సర్జరీ కీలకం అని వైద్యులు చెబుతున్నారు. దానిని బట్టి పంత్ కోలుకునేది ఆధారపడి ఉంటుంది..’ అని తెలిపాడు.
పంత్ కు ఇటీవలే కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ దిన్షా పరిద్వాలా ఆధ్వర్యంలో మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతమైనా అతడు ఆశించినంత గొప్పగా స్పందించడం లేదని బీసీసీఐ వర్గాలు వాపోతున్నాయి.
ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం ఈ ఏడాదంతా పంత్ ను మళ్లీ ఫీల్డ్ లో చూడటం డౌటే. భారత్ ఈ ఏడాదిలో కీలక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (భారత్ క్వాలిఫై అయితే), వెస్టిండీస్ టూర్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు డిసెంబర్ లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. బీసీసీఐ చెబుతున్నదాని ప్రకారం పంత్ కోలుకోవడానికి 9 నెలలు పట్టినా అతడు వరల్డ్ కప్ ఆడేది అనుమానమే...