ధోని కాదు.. యువీ క్రికెట్ కెరీర్ అతని వల్లే ముగిసింది : రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్
భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ క్రికెట్ జీవితం నాశనమైంది ధోనీ వల్ల కాదనీ, మరో కెప్టెన్ వల్ల అని టీం ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.
యువరాజ్ సింగ్.. ప్రపంచ క్రికెట్ కు పరిచయం అక్కరలేని పేరు. అతనదైన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రవేశాడు యూవీ. భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకరిగా గుర్తింపు సాధించాడు. 2007 ఐసీసీ టీ20 ప్రపంచ కప్, 2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించారు.
2007 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పేసర్ స్టీవర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బాల్స్‌లో 6 సిక్సర్లు బాదిన సంగతి ఎవరూ మర్చిపోలేరు. అదేవిధంగా 2011 వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఈ మెగా టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ ఒక సెంచరీతో మొత్తం 362 పరుగులు చేశారు. బ్యాటింగ్ లోనే కాకుండా అద్బుతమైన బౌలింగ్‌తో 15 వికెట్లు తీసుకున్నాడు. 28 ఏళ్ల తర్వాత టీం ఇండియా వన్డే ప్రపంచ కప్ గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించారు.
భారతదేశంలో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్‌కి క్యాన్సర్ వచ్చిన వార్త అతని అభిమానులతో పాటు క్రీడా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడిన యువీ, క్యాన్సర్‌ను ఓడించి క్రికెట్ మైదానానికి తిరిగి రావడం చాలా మంది క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తినిచ్చింది.
అయితే, ధైర్యం కోల్పోని యువరాజ్ సింగ్ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఇక్కడ అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు రాకపోవడంతో యువరాజ్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
అయితే, యువరాజ్ సింగ్ క్రికెట్ కు దూరం కావడానికి ధోని క్రికెట్ సర్కిల్ లో చాలా సార్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, యూవీ క్రికెట్ కు దూరం కావడానికి ధోని కారణం కాదని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. యూవీ క్రికెట్ జీవితం అనుకోకుండా మధ్యలోనే ముగియడానికి కారణం ధోనీ కాదు, విరాట్ కోహ్లీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ను ఓడించి జట్టుకు తిరిగి వచ్చారు. మన వాళ్లతో కలిసి రెండు ప్రపంచ కప్ లను భారత్ కు అందించాడు. అలాంటప్పుడు కెప్టెన్ అయిన వ్యక్తి అలాంటి ఆటగాడు జట్టుకు తిరిగి వచ్చినప్పుడు అతని వెంట నిలబడాలి. కెప్టెన్‌గా ఒక రకమైన ప్రమాణాన్ని కలిగి ఉండాలి అని ఉతప్ప అన్నారు.
కొన్నిసార్లు నియమాలను కొన్ని సందర్భాల్లో సడలించుకోవాలి. ఎందుకంటే యువరాజ్ కేవలం ట్రోఫీనే గెలవలేదు, క్యాన్సర్‌ను కూడా ఓడించారు. అతను తన జీవితంలో కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. యువరాజ్ సింగ్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో తనకు 2 మార్కులు తగ్గించమని కోరారు. కానీ కెప్టెన్ అంగీకరించలేదని రాబిన్ ఉతప్ప చెప్పాడు.
"అయితే, దీని తర్వాత యువరాజ్ సింగ్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణులయ్యారు. జట్టుకు కూడా తిరిగి వచ్చారు. కానీ అతని ప్రదర్శన అంతగా బాగాలేదు. అందుకే అతన్ని జట్టు నుంచి పూర్తిగా తప్పించారు. దీని తర్వాత అతనికి జట్టులో అవకాశమే రాలేదు" అని ఉతప్ప అన్నారు.
లీడర్‌షిప్ గ్రూప్‌లో ఉన్నవారు యువరాజ్ సింగ్‌కు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నారు. అతని కఠినమైన వ్యక్తిత్వం కారణంగా అంతా అతను అనుకున్నట్లుగానే జరిగింది అని రాబిన్ ఉతప్ప అన్నారు.