రోహిత్‌కు రెస్ట్ ఎందుకు..? ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు కదా..?
WI vs IND: త్వరలోనే కరేబియన్ దీవులకు వెళ్లనున్న భారత జట్టు అక్కడ వెస్టిండీస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తర్వాత భారత జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. చాలామంది వెకేషన్‌లో, ఫ్యామిలీతోనో గడుపుతూ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా అతీతుడు కాదు. రోహిత్ కూడా ఇంగ్లాండ్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిశాక భార్యా,కూతురుతో అక్కడే సేద తీరుతున్నాడు.
అయితే జులై 12 నుంచి వెస్టిండీస్ వేదికగా జరుగబోయే టెస్టు సిరీస్, వన్డేలలో ఏదో ఒకదానికి అతడికి విశ్రాంతినిచ్చే అవకాశాలున్నట్టు వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో రోహిత్‌కు టెస్టులలో విశ్రాంతినిచ్చే అవకాశముందున్న గుసగుసలు వినిపించాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేస్తుంది బీసీసీఐ..
Rohit Sharma
కరేబియన్ పర్యటనలో రోహితే భారత జట్టును నడిపిస్తాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత రోహిత్ ఖాళీగానే ఉంటున్నాడని.. నెల రోజుల పాటు అతడు రెస్ట్ తీసుకున్నాక కూడా మళ్లీ రెస్ట్ ఇవ్వడం అర్థం లేని వాదన అని.. ఇవన్నీ పుకార్లేఅని కొట్టిపారేశాడు.
‘రోహిత్ ఫిట్ గానే ఉన్నాడు. అతడు సెలక్షన్ కు అందుబాటులో ఉంటాడు. టెస్టు, వన్డేలకు అతడే సారథిగా వ్యవహరిస్తాడు. కానీ టీ20 లకు మాత్రం హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటాడు..’ అని స్పష్టం చేశాడు. ఇక గాయాల నుంచి కోలుకుంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్లు కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ లు విండీస్ టూర్‌కు అందుబాటులో ఉండరు. ఈ ముగ్గురిలో బుమ్రా మాత్రం ఆగస్టులో జరిగే ఐర్లాండ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
ఇక విండీస్ టూర్ లో భాగంగా టెస్టు జట్టులో భారీ మార్పులేమీ జరిగే అవకాశం లేనట్టే తెలుస్తున్నది. ఇటీవల కొంతకాలంగా విఫలమవుతున్న ఛటేశ్వర్ పుజారా తన స్థానాన్ని కాపాడుకునే అవకశమున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయతే కొన్ని కొత్త ముఖాలను మాత్రం టీమ్ లోకి తీసుకునే అవకాశముంది. సర్ఫరాజ్ ఖాన్, ముకేశ్ కుమార్ లకు ఛాన్స్ దక్కొచ్చు. టెస్టులలో సిరాజ్, షమీలకు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. వర్క్ లోడ్ ఫార్ములా లో భాగంగా గిల్ కు కూడా విశ్రాంతినివ్వనున్నట్టు తెలుస్తున్నది.
కాగా జూన్ చివరి వారంలో భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ సభ్యులు సమావేశమై జట్టును ప్రకటించే అవకాశముంది. జులై మొదటివారంలో టీమిండియా విండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జులై 12 నుంచి డొమినికా వేదికగా విండీస్ తో తొలి టెస్టు ఆడనుంది. ప్రస్తుతం లండన్ లోనే హాలీడే ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అక్కడ్నుంచే నేరుగా వెస్టిండీస్ కు వెళ్లి జట్టుతో కలుస్తారు.