నేను కాదు.. నా దృష్టిలో 'GOAT' అని పిలిచే అర్హత వాళ్లిద్దరికే.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని అతడి అభిమానులంతా G.O.A.T అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో ‘గోట్’గా వ్యవహరించే దీనికి అర్థం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అయితే తాను మాత్రం ‘గోట్’ కాదంటున్నాడు ఈ రన్ మెషీన్.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా గత ఆదివారం మెల్‌బోర్న్ లో పాకిస్తాన్ తో ముగిసిన ఉత్కంఠ పోరులో భారత్ ను ఒంచిచేత్తో గెలిపించిన కోహ్లీ.. తాజాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దశాబ్దానికి పైగా ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఈ రన్ మెషీన్ ను అందరూ ‘గోట్’గా వ్యవహరిస్తారు.
సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానులు అతడిని అదే పేరుతో పిలుస్తారు. కానీ కోహ్లీ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ప్రపంచ క్రికెట్ లో తనకు తెలిసి అలా పిలిచే అర్హత ఇద్దరు దిగ్గజ క్రికెటర్లకు మాత్రమే ఉందని చెప్పాడు. ఆ ఇద్దరూ తాను ఆరాధించే టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అని చెప్పాడు.
పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షో లో కోహ్లీ తన భావాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా గూగుల్ లో అత్యధిక మంది .. కోహ్లీని అందరూ ‘గోట్’ అని ఎందుకు పిలుస్తారు..? అని అడిగిన ప్రశ్నకు అతడు సమాధానమిచ్చాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. ‘లేదు. నన్ను నేను గోట్ గా పరిగణించను. నాకు తెలిసి క్రికెట్ లో గోట్ అని పిలుచుకునే అర్హత ఇద్దరికి మాత్రమే ఉంది. అది సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్..’ అని బదులిచ్చాడు.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మెల్‌బోర్న్ లో ఆడిన ఇన్నింగ్స్ ను కోహ్లీ.. తనకు ఎంతో ఇష్టమైన మొహాలీ కంటే ఉత్తమ ఇన్నింగ్స్ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఈ గోట్ చర్చ కూడా మొదలైంది.
ఇక తాను గోట్ గా పరిగణించే సచిన్ తో కలిసి కోహ్లీ ఐదేండ్ల పాటు ఆడాడు. ఇద్దరూ కలిసి 2011 వన్డే ప్రపంచకప్ లో భారత్ సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషించారు. విండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు కోహ్లీ.. రిచర్డ్స్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.