- Home
- Sports
- Cricket
- శత్రువుతో పడుకుంటున్నావ్.. సిగ్గనిపించడం లేదా..? ఇంగ్లాండ్ హెడ్ కోచ్ పై కివీస్ మీడియా ఫైర్
శత్రువుతో పడుకుంటున్నావ్.. సిగ్గనిపించడం లేదా..? ఇంగ్లాండ్ హెడ్ కోచ్ పై కివీస్ మీడియా ఫైర్
ENG vs NZ 1st TEST LIVE: ఇటీవలే ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా నియమితుడైన న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్ కల్లమ్ పై ఆ దేశ మీడియా దుమ్మెత్తిపోస్తున్నది.

వృత్తిలో భాగంగా ఒక ఆటగాడు తమ జాతీయ జట్టుకే గాక పలు ఫ్రాంచైజీలకు ఆడుతున్న రోజులివి. ఒక సీజన్ లో ఓ ఫ్రాంచైజీలో ఉంటే మరో సీజన్ లో వేరే జట్టుకు మారుతున్నాడు. ఇందుకు కోచ్ లకు కూడా ప్రత్యేకమైన మినహాయింపేమీ లేదు.
అయితే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన బ్రెండన్ మెక్ కల్లమ్ విషయంలో మాత్రం ఇది కాస్తా బెడిసికొట్టినట్టుంది. తమ దేశానికి చెందిన ఆటగాడు.. తమ ప్రత్యర్థులతో చేతులు కలపడమే గాక సొంత జట్టుకు వ్యతిరేకంగా ఆడటాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
‘శత్రువుతో పక్క పంచుకుంటున్నావ్.. సిగ్గనిపించడం లేదు..’ అని న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు, ఆ దేశపు మీడియా మెక్ కల్లమ్ పై దుమ్మెత్తిపోస్తున్నది. మెక్ కల్లమ్ ఇటీవలే ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు (టెస్టులకు మాత్రమే)కు హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. అయితే అతడి తొలి అసైన్మెంట్.. తన సొంత జట్టు (న్యూజిలాండ్) మీదే. ఈ నెల 2 (గురువారం) నుంచి ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
మూడు టెస్టులలో భాగంగా ప్రతిష్టాత్మక లార్స్ లో గురువారం నుంచి ప్రారంభించబోయే టెస్టు కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టుతో కలిసిన మెక్ కల్లమ్.. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ తో పాటు ఇతర ఆటగాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అయితే మెక్ కల్లమ్ ఇంగ్లాండ్ రెడ్ బాల్ కోచ్ గా ఎంపికవడంపై న్యూజిలాండ్ మీడియా సంతోషంగా లేదు. అయితే వాళ్ల ఆగ్రహానికి కారణం కూడా ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలోనే న్యూజిలాండ్ కు తీవ్ర పరాభావం ఎదురైంది.
ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించడమే గాక బ్రెండన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా అతడిపై కివీస్ ఫ్యాన్స్ ఫైర్ అవడానికి కారణమయ్యాయి. ఇంగ్లాండ్ జట్టుకు పూర్వ వైభవం తీసుకువస్తానని.. ప్రపంచంలో నెంబర్ వన్ టెస్ట్ టీమ్ గా నిలుపుతానని వ్యాఖ్యానించాడు.
కాగా 2021లో ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నెగ్గిన కివీస్.. ఈ సీజన్ (2021-23) లో గొప్పగా రాణించడం లేదు. మరి బ్రెండన్ చెప్పినట్టు ఇంగ్లాండ్ ను నెంబర్ వన్ టీమ్ గా చేస్తే అతడు తక్షణం ఓడించబోయేది న్యూజిలాండ్ నేనా..? అంటే సొంత దేశాన్ని ఓడించి ప్రత్యర్థి జట్టుకు ఆ అవకాశమిస్తావా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు ఇలా తమ దేశానికి చెంది ఇతర దేశాలకు హెడ్ కోచ్ గా వ్యవహరించేవారిని విమర్శించడం ఇదే తొలిసారి కాదు. గతంలో టీమిండియా హెడ్ కోచ్ గా పనిచేసిన జాన్ రైట్ (గంగూలీ సారథ్యంలో) పై కూడా ఇదే తరహా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ రైట్ మాత్రం ఇవన్నీ పట్టించుకోలేదు. గంగూలీ హయాంలోని టీమిండియకు కొత్త మార్గాన్ని చూపాడు రైట్.