కివీస్‌కు సర్‌ప్రైజ్..ఆ పేసర్ మళ్లీ వస్తున్నాడు.. వరల్డ్ కప్‌లో ఆడటం ఖాయమేనట..
గతేడాది సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకున్న కివీస్ వెటరన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఫ్రాంచైజీ క్రికెట్ తప్ప అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపుగా తప్పుకున్నాడు. కానీ అతడు మళ్లీ..

గత వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ దాకా వెళ్లి తుది పోరులో తృటిలో ట్రోఫీ కోల్పోయిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. 2021లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆసీస్ చేతిలో ఓడింది. కానీ ఈసారి మాత్రం వన్డే వరల్డ్ కప్‌ను సాధించేందుకు పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నది.
ఈ మేరకు గతేడాది సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకున్న వెటరన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ను తిరిగి జాతీయ జట్టులో ఆడించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బౌల్ట్ తో చర్చలు జరిపిని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.. బౌల్ట్ వన్డే వరల్డ్ కప్ లో ఆడటం ఖాయమేనని చెబుతున్నది.
తన ఫ్యామిలీతో గడిపేందుకు గాను బౌల్ట్.. గతేడాది న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్ లో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకే జట్టులో ఎంపిక చేసుకునేందుకు తొలి ప్రాధాన్యం దక్కుతుంది. కాంట్రాక్ట్ లో లేనివారిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోరు.
కాంట్రాక్టు నుంచి తప్పుకున్న బౌల్ట్ ఫ్రాంచైజీ క్రికెట్ తప్ప అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపుగా తప్పుకున్నాడు. కానీ గతంలో ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బౌల్ట్..‘నేను నా నిర్ణయం తీసుకున్నా (కాంట్రాక్టు నుంచి వైదొలగడం గురించి).. న్యూజిలాండ్ జాతీయ జట్టుకు 13 ఏండ్లు సేవలందించా. నాకు 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆడాలనే కోరిక ఉంది. చూద్దాం అది నెరవేరుతుందో లేదో..’అని అన్నాడు.
కాగా ఇదే విషయమై ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్ సీఈవో డేవిడ్ వైట్ మాట్లాడుతూ.. ‘రాబోయే వన్డే వరల్డ్ కప్ లో బౌల్ట్ ఆడకపోతే అది నాకు నిజంగా ఆశ్చర్యమే. సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లకు మా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. కానీ బౌల్ట్ ఛాంపియన్ బౌలర్. గత కొన్నిరోజులుగా మేం బౌల్ట్ తో చర్చిస్తున్నాం. అతడు కూడా వరల్డ్ కప్ ఆడేందుకు ఉత్సాహంగా చూస్తున్నాడు...’ అని తెలిపాడు.
కాగా గతేడాది బౌల్ట్ తర్వాత మరో నలుగురైదుగురు కివీస్ క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులకుని ఫ్రాంచైజీ క్రికెట్ లోనే కొనసాగుతున్నారు. వీరిలో జేమ్స్ నీషమ్ కూడా ఒకడిగా ఉన్నాడు. బౌల్ట్ లేకపోవడం, సౌథీ కూడా మునపటి స్థాయిలో రాణించలేకపోవడంతో చాలాకాలంగా కివీస్ బౌలింగ్ నాసిరకంగా మారిపోయింది. ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, షిప్లే లు పెద్దగా ప్రభావం చూపడం లేదు. బౌల్ట్ తిరిగి జాతీయ జట్టుతో చేరితే అది కివీస్ కు కచ్చితంగా ఉపకరించే విషయమే..