15 సీజన్లు, 9 మంది ప్లేయర్లు... ఐపీఎల్‌లో అన్ని సీజన్లు ఆడిన ఆటగాళ్లు వీరే...
ఐపీఎల్ 2022 సీజన్ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. ప్రపంచంలోనే మోస్ట్ క్రేజీ, పాపులర్ క్రికెట్ లీగ్ కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 10 ఫ్రాంఛైజీలతో సాగే ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా 9 మంది ప్లేయర్లు, 15వ సారి ఈ మెగా లీగ్‌లో పాల్గొనబోతున్నారు...

ఎమ్మెస్ ధోనీ... చెన్నై సూపర్ కింగ్స్ సారథి 2008 నుంచి బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ఎమ్మెస్ ధోనీ. సీఎస్‌కేపై బ్యాన్ పడిన రెండేళ్లు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు మాహీ. మాహీకి 2022 ఆఖరి ఐపీఎల్ సీజన్ కావచ్చని టాక్ నడుస్తోంది...
విరాట్ కోహ్లీ... ఐపీఎల్ చరిత్రలో 15 సీజన్ల పాటు ఒకే ఫ్రాంఛైజీకి ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. గత 9 సీజన్లలో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, ఈసారి ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ప్లేయర్‌గా పాల్గొనబోతున్నాడు...
రోహిత్ శర్మ... డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌లో కెరీర్ ఆరంభించి, ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లిన కెప్టెన్‌గా మారాడు రోహిత్ శర్మ. గత 9 సీజన్లలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడబోతున్న మొదటి సీజన్ ఇదే...
శిఖర్ ధావన్... గత ఐదు సీజన్లుగా ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నాడు గబ్బర్. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకి ఆడిన శిఖర్ ధావన్, ఈసారి పంజాబ్ కింగ్స్ తరుపున ఆడబోతున్నాడు.
వృద్ధిమాన్ సాహా... భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, తన కెరీర్‌ను కేకేఆర్‌లో మొదలెట్టాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన సాహా, ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడబోతున్నాడు...
దినేశ్ కార్తీక్... ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడాడు డీకే. ఈ సీజన్‌లో మరోసారి ఆర్‌సీబీ తరుపున ఆడబోతున్నాడీ వికెట్ కీపింగ్ బ్యాటర్...
మనీశ్ పాండే... ఐపీఎల్‌లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి భారత క్రికెటర్ మనీశ్ పాండే. ముంబై ఇండియన్స్‌లో కెరీర్ ఆరంభించి, ఆర్‌సీబీ, పూణే వారియర్స్ ఇండియా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకి ఆడిన మనీశ్ పాండే, ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కి ఆడబోతున్నాడు.
రాబిన్ ఊతప్ప... టాలెంట్‌కి కొదువ లేకపోయినా సరైన అవకాశాలు రాని ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. ముంబై ఇండియన్స్‌లో కెరీర్ ప్రారంభించిన రాబిన్ ఊతప్ప, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ ఇండియా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకి ఆడాడు. గత సీజన్‌లో సీఎస్‌కేకి ఆడిన ఊతప్పని, వేలంలో రూ.కోట్లకు తిరిగి కొనుగోలు చేసిందా ఫ్రాంఛైజీ...
అజింకా రహానే... ఐపీఎల్‌లో దాదాపు 4 వేల పరుగులున్నా, ఫ్రాంఛైజీలు పెద్దగా పట్టించుకోని ప్లేయర్ అజింకా రహానే. ముంబై ఇండియన్స్‌లో కెరీర్ మొదలెట్టిన రహానే, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకి ఆడాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో కేకేఆర్, అజింకా రహానేని బేస్ ప్రైజ్‌కి రూ.1 కోటికి కొనుగోలు చేసింది.
ఫ్రాంఛైజీ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిల్లియర్స్, ఈ జాబితాలో చోటు దక్కించుకునే అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. కెరీర్ ఆరంభంలో మూడు సీజన్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ఆడిన ఏబీ డివిల్లియర్స్, ఆ తర్వాత 11 సీజన్లు ఆర్‌సీబీకి ఆడాడు. ఏబీ డివిల్లియర్స్‌తో పాటు భారత బౌలర్లు అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా కూడా ఈ సారి వేలంలో అమ్ముడుపోని కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ ఆడడం లేదు.