Rishabh Pant: వికెట్ కీపర్ గా టాప్.. రిషబ్ పంత్ సెంచరీ రికార్డులు ఇవే
IND vs ENG: లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సిక్సర్ తో సెంచరీని పూర్తి చేశారు. ధోని రికార్డును బద్దలు కొట్టడంతో పాటు పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

Rishabh Pant: లీడ్స్‌లో రిషబ్ పంత్ రికార్డు సెంచరీ
Rishabh Pant century records: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్‌లో రెండో రోజు పంత్ తన ఏడో టెస్ట్ సెంచరీని సాధించాడు.
ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో పంత్ సిక్సర్ కొట్టి తన సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ తర్వాత పంత్ గ్రౌండ్‌పై సోమర్సాల్ట్ వేయడం అభిమానులను, సహచరులను అలరించింది. ఇది పంత్ కు ఇంగ్లాండ్ గడ్డపై మూడవ టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
99 పరుగులతో ఉన్న సమయంలో సిక్సర్ తో రిషబ్ పంత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 146 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 71.92 స్ట్రైక్ రేటుతో తన సెంచరీని సాధించాడు. మొత్తంగా 134 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్
ఈ ఇన్నింగ్స్ లోనే రిషబ్ పంత్ మరో రికార్డు సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా పంత్ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఆడిన 35 టెస్ట్ మ్యాచ్‌లలో పంత్ ఏకంగా 58 సిక్సర్లు బాదాడు. ఈ ఫీట్ ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు.
ఇంతకుముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. అతను ఇప్పటి వరకు 56 సిక్సర్లు కొట్టి భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే, లీడ్స్ మ్యాచ్‌లో పంత్ 58వ సిక్సును కొట్టి ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రను పరిశీలిస్తే, మొత్తం ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాప్ లో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 83 సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు పంత్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతన్నాడు.
ఏబీ డివిలియర్స్, సంగక్కర రికార్డులు సమం చేసిన పంత్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు మొత్తం 17 సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ 12 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.
అలాగే, ఇంగ్లాండ్ తరఫున 1929–1939 మధ్యకాలంలో ఆడిన లెస్ ఎమ్స్ 8 సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ మాట్ ప్రయర్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర, న్యూజిలాండ్‌కు చెందిన బీజే వాట్లింగ్ ల సెంచరీ రికార్డులను రిషబ్ పంత్ సమం చేశాడు. వీరంతా 7 టెస్ట్ సెంచరీలతో సమానం స్థాయిలో ఉన్నారు.
భారత వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు.. ధోని రికార్డు బ్రేక్
రిషబ్ పంత్ ఇప్పుడు భారత వికెట్ కీపర్లలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 7 టెస్ట్ సెంచరీలతో ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటి వరకు ఎంఎస్ ధోనీ ఈ రికార్డును 6 సెంచరీలతో కలిగి ఉన్నాడు.
భారత టెస్ట్ వికెట్ కీపర్లు-అత్యధిక సెంచరీలు
1. రిషబ్ పంత్ 7 సెంచరీలు
2. ఎంఎస్ ధోని 6 సెంచరీలు
3. వృద్ధిమాన్ సాహా 3 సెంచరీలు
విదేశీ గడ్డపై వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ మార్క్
ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సెంచరీ చేయడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఊహించని స్వింగ్, క్లాసిక్ బౌలింగ్ అటాక్స్, ఇక్కడి పిచ్ లు బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటిది, ఒక విదేశీ వికెట్ కీపర్‌గా ఇంగ్లాండ్‌లో మూడు టెస్ట్ సెంచరీలు చేయడం అంటే అది కేవలం ప్రతిభ మాత్రమే కాదు, అసాధారణ స్థాయిలో ఉన్న ఆటతీరు. పంత్ ఈ అరుదైన ఘనతను సాధించడం అతడి కెరీర్‌లో గోల్డెన్ ఛాప్టర్‌గా నిలిచిపోతుంది.
2018లోనే అరంగేట్రం… అదే ఏడాదిలో సెంచరీ కొట్టిన రిషబ్ పంత్
2018లో ఇంగ్లాండ్‌లోనే తన టెస్ట్ అరంగేట్రం చేసిన రిషబ్ పంత్, అదే టూర్ చివర టెస్ట్‌లో సెంచరీతో మెరిసాడు. కాగా, పంత్ టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు 90 నుంచి 99 పరుగుల మధ్య అవుటయ్యాడు. ఇది అతడి దూకుడు, ఆటతీరు గురించి గొప్పగా చెబుతుంది. అతడి లక్ష్యం పెద్ద స్కోర్ మాత్రమే కాదు జట్టు అవసరానికి అనుగుణంగా వేగంగా స్కోరింగ్ చేయడం.
స్టూపిడ్ నుంచి సూపర్బ్.. పంత్ పై సునీల్ గవాస్కర్ కామెంట్స్ వైరల్
2024 ఆస్ట్రేలియా టూర్‌లో రిషబ్ పంత్ నిర్లక్ష్యంగా అవుటవడంతో సునీల్ గవాస్కర్ “స్టూపిడ్, స్టూపిడ్, స్టూపిడ్” అని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పంత్ ఆట చూసిన వెంటనే “సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్” అంటూ కామెంటరీ బాక్స్ నుంచే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది పంత్ ఆటతీరు ఎంతగా మెరుగైందన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది లీడ్స్ సెంచరీ ఇన్నింగ్స్.
రిషబ్ పంత్ సెంచరీ తర్వాత మైదానంలో ఆసక్తికరంగా సెలబ్రేట్ చేశాడు. సాధారణ ఆటగాళ్లు బ్యాట్ ఎత్తి సందేశం పంపితే, పంత్ మాత్రం గ్రౌండ్‌పైనే సోమర్సాల్ట్ వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది అభిమానుల కోసం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షాట్ అయినప్పటికీ, అతని ఉత్సాహాన్ని ప్రతిబింబించింది.
A maximum to get to his century in style 💯
3rd Test Hundred in England for vice-captain Rishabh Pant 👏👏
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @RishabhPant17pic.twitter.com/txmdcvSrfS— BCCI (@BCCI) June 21, 2025