IPL: సారీ, కొచ్చికి రాలేం.. వేలానికి ముందు ఫ్రాంచైజీలకు షాకిస్తున్న ఫారెన్ కోచ్‌లు.. కారణమిదే
IPL 2023 Auction: వచ్చే సీజన్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం నిర్వహించబోతున్నది బీసీసీఐ. ఈ నెల 23న కేరళలోని కొచ్చిలో వేలం ప్రక్రియ జరగాల్సి ఉంది.
ఐపీఎల్ వేలం కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఉన్నది. కొచ్చి వేదికగా జరుగబోయే ఈ మెగా ఈవెంట్ లో కీలక ఆటగాళ్లను దక్కించుకుని 2023 సీజన్ లో సత్తా చాటాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అయితే వేలానికి ముందే ఫ్రాంచైజీలకు ఫారెన్ కోచ్ లు భారీ షాకిస్తున్నారు.
ఈనెల 23న జరిగే ఐపీఎల్ వేలంలో తాము హాజరుకాబోమని చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు డ్వేన్ బ్రావో, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్, సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ లు బ్రియాన్ లారా, డేల్ స్టెయిన్ లు ఇదివరకే ఫ్రాంచైజీలకు తెలిపారట. వీరితో పాటు పది ఫ్రాంచైజీలలో ఉన్న ఫారెన్ కోచ్ లు ఈ వన్ డే ఈవెంట్ కు వచ్చేది అనుమానంగానే ఉంది.
వేలంలో ఫారెన్ కోచ్ లు అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం బీసీసీఐ నిర్ణయించిన తేదీనే. డిసెంబర్ 23న వేలం జరగాల్సి ఉంది. విదేశాల్లో అవి క్రిస్‌మస్ సెలవులు. ఫారెన్ కోచ్ లలో దాదాపు 80 శాతం మంది క్రిస్టియానిటీని అనుసరిస్తున్నవారే కావడం గమనార్హం.
క్రిస్‌మస్ సెలవులలో ఫ్యామిలీతో గడిపేందుకు ఉత్సాహం చూపించే విదేశీయులు సాధారణంగా ఆ హాలీడేస్ ను జాలిగా ఎంజాయ్ చేస్తారు. అదీగాక ఐపీఎల్ వేలం జరిగేదే ఒక్కరోజు. ఒక్కరోజు కోసం సముద్రాలు దాటి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇండియాకు రావాల్సిన అవసరం లేదు. అదీగాక ఈ వేలంలో ఉన్నదే 87 స్లాట్స్. మహా అయితే ఒక్కో టీమ్ దక్కించుకునేది ఏడెనిమిది మందిని. ఈ ప్రక్రియ కోసం ఇండియాకు రావాల్సిన పన్లేదనే భావనలో ఫారెన్ కోచ్ లు ఉన్నారు.
ఇదే విషయమై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ..‘అవును. వేలంలో ఫ్లెమింగ్ తో పాటు బ్రావో, హస్సీ, ఎరిక్ సిమన్స్ హాజరుకావడం లేదు. మా ఫారెన్ కోచింగ్ స్టాఫ్ ఎవరూ కొచ్చికి రావడం లేదు. క్రిస్‌మస్ హాలిడేస్ ఇందుకు కారణం. వాళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు..’అని తెలిపాడు.
ఐపీఎల్ లో ఉన్న పది జట్లలో ఫారెన్ కోచ్ లే ఎక్కువ. ఆ జాబితా చాంతాడంతా ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తప్ప మిగలిన ఫ్రాంచైజీల హెడ్ కోచ్ లు అంతా ఫారెన్ వాళ్లే. ఒక్క హెడ్ కోచ్ లే కాదు.. ఫీల్డింగ్, బౌలింగ్, అసిస్టెంట్ కోచ్ లు కూడా ఫారెన్ వాళ్లే. ఐపీఎల్ అన్ని జట్ల కోచింగ్ సిబ్బందిలో సుమారు 80 శాతం మంది ఫారెన్ కోచ్ లే కావడం గమనార్హం.
వీళ్లు డైరెక్టుగా వేలం ప్రక్రియకు హాజరుకాకపోవడంతో ఫ్రాంచైజీలకు నష్టం తప్పదు. అయితే వీరిలో పలువురు నేరుగా వేలానికి హాజరుకాకపోయినా వీడియో కాన్ఫరెన్స్, కాల్స్ ద్వారా హాజరయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.