- Home
- Sports
- Cricket
- ‘టీ20లలో నెంబర్ వన్ బౌలర్‌ను నాలుగు ఓవర్లు వేయించకపోవడం ఏమిటి..? పాండ్యాది చెత్త నిర్ణయం..’
‘టీ20లలో నెంబర్ వన్ బౌలర్‌ను నాలుగు ఓవర్లు వేయించకపోవడం ఏమిటి..? పాండ్యాది చెత్త నిర్ణయం..’
స్పిన్ కు అనుకూలించిన లక్నో పిచ్ పై ఆశ్చర్యకరంగా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు రెండు ఓవర్లే ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా లతో ఫుల్ కోటా వేయించిన పాండ్యా.. చాహల్ కు మాత్రం రెండు ఓవర్ల తర్వాత మళ్లీ బంతినివ్వలేదు.

ఇండియా-న్యూజిలాండ్ మధ్య లక్నో వేదికగా ముగిసిన రెండో టీ20 మ్యాచ్ లో కివీస్ పతనానికి నాంది పలకింది టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. చాహల్ తాను వేసిన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ ఓవర్ మెయిడిన్ కూడా. తర్వాత ఓవర్లో కూడా నాలుగు పరుగులే ఇచ్చాడు.
స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై ఆశ్చర్యకరంగా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. చాహల్ కు మళ్లీ బంతినివ్వలేదు. కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా లతో ఫుల్ కోటా వేయించిన పాండ్యా.. చాహల్ కు మాత్రం రెండు ఓవర్లే ఇచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్.. పాండ్యాపై విమర్శలు గుప్పించాడు.
కివీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘ఇది షాకింగ్ డిసీషన్. అసలు ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. స్పిన్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై చాహల్ కు ఫుల్ కోటా బౌలింగ్ ఇవ్వకపోవడమేమిటి...? టీ20లలో అతడు మీ జట్టుకు నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు.
అటువంటి బౌలర్ ను కేవలం రెండు ఓవర్లు వేయించి తర్వాత పక్కనబెట్టడం ఆశ్చర్యకర నిర్ణయం. యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, శివం మావిలకు అవకాశమివ్వడంలో తప్పులేదు. అలా అయితే చాహల్ తో మొదటి, చివరి ఓవర్లు వేయిస్తే సరిపోయేది. లక్నో పిచ్ పై అతడు కివీస్ ను మరింత దెబ్బకొట్టేవాడు.
స్పిన్ కు అనుకూలించిన ఈ పిచ్ పై చాహల్ కు గనక ఫుల్ కోటా ఇచ్చుంటే కివీస్.. 80-85 పరుగులకే పరిమితమై ఉండేది. అలాగాక హుడాతో నాలుగు ఓవర్లు వేయించాడు..’అని చెప్పాడు. హార్ధిక్ నాలుగు ఓవర్లు విసిరి అత్యధిక పరుగులు సమర్పించుకునడానికి బదులుగా తన ఓవర్లను అతడు చాహల్ కు ఇస్తే బాగుండేదని గౌతి అభిప్రాయపడ్డాడు.
ఇదిలాఉండగా నిన్నటి మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ వికెట్ తీయడం ద్వారా యుజ్వేంద్ర చాహల్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు (టీ20 ఫార్మాట్ లో) తీసిన బౌలర్ గా నిలిచాడు. అలెన్ వికెట్ చాహల్ కు 91వది. గతంలో ఈ రికార్డు వెటరన్ పేసర్ భువనేశ్వర్ పేరిట ఉండేది.