ఇవన్నీ నా హయాంలో జరిగినవి కాదా..? నేను ఏం పని చేయలేదని ఎలా అంటారు..? దాదా ఆగ్రహం
BCCI Elections: బీసీసీఐ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండోసారి అధ్యక్ష పీఠమెక్కాలని చూసి విఫలమైన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ.. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.

Image credit: PTI
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెళ్తూ వెళ్తూ తాను, తన పనితీరుపై ఆరోపణలు చేసిన బీసీసీఐ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బీసీసీఐ చీఫ్ గా దాదా విఫలమయ్యాడని.. అతడి పనితీరుపై చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్.. ఇటీవల ముంబైలో నిర్వహించిన సమావేశంలో ఆరోపించినట్టు వార్తలు వచ్చాయి.
అసలు గంగూలీ రెండోసారి అధ్యక్ష ఆశలకు గండి కొట్టింది సెక్రటరీ జై షా అని వినిపిస్తున్నా దాదా అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకించింది మాత్రం శ్రీనివాసన్ అని కూడా బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ముంబై లో ముగిసిన సమావేశంలో శ్రీనివాసన్.. దాదా పనితీరుపై తీవ్ర విమర్శలు చేసినట్టు వార్తలు వినిపించాయి.
అయితే దీనిపై గంగూలీ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో శ్రీనివాసన్ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చాడు. ‘నేను క్రికెటర్లకు ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేటర్ ను. నా హయాంలో మంచి విషయాలెన్నో జరిగాయి. కోవిడ్ సందర్భంలో బయటకు రావడానికే అందరూ భయపడుతుంటే ఐపీఎల్ వంటి మెగా టోర్నీని విజయవంతంగా నిర్వర్తించాను.
భారత అండర్-19 జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గింది. ఐపీఎల్ మీడియా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత జట్టు రజత పతకం సాధించింది. భారత జట్టు ఆస్ట్రేలియా లో టెస్టు సిరీస్ గెలిచింది. ఇవన్నీ నా హయాంలో జరిగినవే కదా.. ఇవన్నీ నా పనితీరుకు నిదర్శనం కాదా..?’ అని శ్రీనివాసన్ కు కౌంటర్ ఇచ్చాడు.
గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన శ్రీనివాసన్.. వాస్తవానికి 2019లో తన మిత్రుడు బ్రిజేష్ పటేల్ ను బీసీసీఐ అధ్యక్షుడిగా చేయాలని భావించాడు. కానీ చివరి నిమిషంలో గంగూలీ చక్రం తిప్పి అధ్యక్ష పీఠం మీద కూర్చున్నాడు. దీంతో అప్పట్నుంచి శ్రీనివాసన్.. దాదా మీద పగ తీర్చుకోవడానికి చూస్తున్నాడని బీసీసీఐ వర్గాలలో వినిపిస్తున్న టాక్. అందుకే అదును చూసి గంగూలీని దెబ్బకొట్టాడని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇదిలాఉండగా దాదా హయాంలో భారత క్రికెట్ కు కొన్ని మంచి పనులైతే జరిగాయనేది అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులూ కాదనలేని వాస్తవం. కోవిడ్ సమయంలో ఐపీఎల్ నిర్వహణ, రాహుల్ ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా నియమించడం, వీవీఎస్ లక్ష్మణ్ ను ఎన్సీఏ హెడ్ గా తీసుకురావడం, మహిళల ఐపీఎల్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయడం వంటివన్నీ గంగూలీ పనితనానికి నిదర్శనాలే..