సీజన్లు గడుస్తున్నా రాని అవకాశాలు.. టీమ్ మారుతున్న లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయ్
టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ తన బౌలింగ్ తో ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే.

టీమిండియా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమ్ మారుతున్నాడు. ఐపీఎల్ లో గడిచిన రెండు సీజన్లుగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఈ యువ స్పిన్నర్.. మారేది ఐపీఎల్ టీమ్ కాదు. దేశవాళీలో అతడు ప్రాతినిథ్యం వహించే టీమ్..
బిష్ణోయ్.. దేశవాళీలో తన హోం టీమ్ రాజస్తాన్ ను వీడి గుజరాత్ తరఫున ఆడనున్నాడు. గత రెండేండ్లుగా బిష్ణోయ్ ను రాజస్తాన్ సరిగా వినియోగించుకోవడం లేదు. ఈ ఏడాది రంజీ సీజన్ లో అయితే బిష్ణోయ్ చాలా మట్టుకు బెంచ్ కే పరిమితమయ్యాడు. స్లో పిచ్ అయిన జైపూర్ లో కూడా రాజస్తాన్ టీమ్ బిష్ణోయ్ కు అవకాశం కల్పించలేదు.
Image credit: Getty
2022 సీజన్ లో బిష్ణోయ్ రాజస్తాన్ తరఫున ఒకే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. లిస్ట్ - ఎ టోర్నీలలో కొన్ని మ్యాచ్ లలో మాత్రమే అతడికి రాజస్తాన్ తరఫున ఆడే అవకాశం దక్కింది. దీంతో ఇక్కడే ఉంటే తాను బెంచ్ బాయ్ గా మిగిలిపోతానని భావించిన బిష్ణోయ్ గుజరాత్ కు ఆడనున్నాడు.
ఈ విషయాన్ని అతడు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఇన్‌స్టాలో రవి గుజరాత్ అసోసియేషన్ ట్రైనింగ్ కిట్ తో పాటు ఆ జోర్సీని వేసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. బిష్ణోయ్ ఇప్పుడు గుజరాత్ లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లాతో కలిసి ఆడనున్నాడు.
Image credit: PTI
జోధ్‌పూర్‌కు చెందిన బిష్ణోయ్.. భారత్ తరఫున 10 టీ20లు ఆడాడు. ఒక వన్డే మ్యాచ్ లో కూడా అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో లక్నో తరఫున ఆడిన బిష్ణోయ్ 16 వికెట్లు తీసి ఆ జట్టు ప్లేఆఫ్స్ కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. దేశవాళీలో రాణించి త్వరలో టీమిండియాకు ఎంపిక కావాలని ఆశిస్తున్న బిష్ణోయ్ ఈ మేరకు తనుక అవకాశాలివ్వని రాజస్తాన్ ను వదిలేసి గుజరాత్ తరఫున ఆడనున్నాడు. మరి ఇక్కడైనా అతడి ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుందేమో చూడాలి.