- Home
- Sports
- Cricket
- ఓడిపోయాం.. పారిపోలేదు.. సూర్యుడు తూర్పున ఉదయించడం మానుతాడా..? : ముంబై ఆటగాళ్ల నోటి నుంచి తత్వ సూక్తులు
ఓడిపోయాం.. పారిపోలేదు.. సూర్యుడు తూర్పున ఉదయించడం మానుతాడా..? : ముంబై ఆటగాళ్ల నోటి నుంచి తత్వ సూక్తులు
TATA IPL 2022: ఐపీఎల్ లో ఘన కీర్తి కలిగిన జట్టు ఈ సీజన్ లో చతికిలపడుతున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. 2022 లో వరుసగా 6 మ్యాచులు ఓడిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. ఇప్పుడు తమ అభిమానులకు తత్వశాస్త్ర సూక్తులు బోధిస్తున్నారు.

వరుసగా ఆరు మ్యాచులు ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు తత్వం బోధపడినట్టు ఉంది. తాము ఐదుసార్లు ఛాంపియన్లమని విర్రవీగిన ముంబై ఈ సీజన్ లో వరుసగా ఆరు మ్యాచులలో ఓడి అవమానకర స్థితిలో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
ఈ సీజన్ లో ముంబై జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమే అయినా తిరిగి పుంజుకుంటామని చెబుతున్నారు ఆ జట్టు ఆటగాళ్లు. ఇదే క్రమంలో వారు తత్వశాస్త్ర సూక్తులు కూడా వల్లె వేస్తున్నారు.
ఇదే విషయమై ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లక్నోతో మ్యాచ్ అనంతరం స్పందిస్తూ.. ‘మ్యాచ్ గెలవడానికి మేం చాలా కష్టపడ్డాం. అయితే మా పోరాటం సరిపోలేదు. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉండటం గురించి బాధపడటం లేదు. ఇంకా మాకు 8 మ్యాచులు మిగిలున్నాయి. అందులో గెలిచి పుంజుకుంటాం.
మేం మ్యాచులు ఓడిపోయాం. ఆటలో గెలుపు ఓటములు సహజం. ఆట అంటే ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడిపోతారు. మ్యాచ్ ఓడిపోగానే జీవితం ముగిసినట్టు కాదు. మేం మ్యాచులు ఓడిపోయాం. కానీ పోరాటాన్ని ఆపలేదు. మ్యాచ్ ఓడినంత మాత్రానా అన్నీ కోల్పోయినట్టు కాదు.
ఇవాళ పడమరన అస్తమించిన సూర్యుడు రేపు తూర్పున ఉదయించక మానడు. క్రికెట్ లో కూడా అంతే. మ్యాచ్ ఓడినంత మాత్రానా ప్రతీదీ కోల్పోయినట్టు మేం భావించడం లేదు. అదే మా జట్టులో ఉన్న స్ఫూర్తి.
మేం మ్యాచులు ఓడుతున్నందుకు మేం కూడా నిరాశలో ఉన్నాం. అయితే మా కష్టాలను ఎవరూ చూడరు. గెలవడానికి మేమెంత కష్టపడుతున్నామో బయటివారికి తెలియదు...’ అని చెప్పుకొచ్చాడు.
ఓడిపోవాలని ఎవరికీ ఉండదని, తాము కూడా అందుకు అతీతమేమీ కాదని బుమ్రా అన్నాడు. అయితే వాస్తవాన్ని తాము అంగీకరించి ముందుకు సాగాల్సి ఉందని ముంబై బౌలర్ చెప్పుకొచ్చాడు. ప్రతిసారి తాము ఎందులో విఫలమవుతున్నామో చూసి తిరిగి పుంజుకుంటామని బుమ్రా తెలిపాడు.
కాగా.. వరుసగా ఐదు మ్యాచులు ఓడి ఇకనైనా పుంజుకుంటుందని ముంబై అభిమానులు ఆశించిన శనివారం నాటి లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో కూడా రోహిత్ సేన దారుణ పరాభావాన్ని మూటగట్టుకుంది. ఇక రాబోయే ప్రతి మ్యాచులో ముంబై గెలవాల్సిందే. 8 మ్యాచులలో ఏ ఒక్కటి ఓడినా అది ప్లే ఆఫ్స్ చేరదు.